అదానీని కాపాడటానికి ఆ అమెరికన్ సంస్థ ఎందుకు ప్రయత్నిస్తోంది ?

GQG సంస్థ‌ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 38,701,168 ఈక్విటీ షేర్ల కోసం 5,460 కోట్ల రూపాయలు, అదానీ పోర్ట్స్‌లో 8.86 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం 5,282 కోట్ల రూపాయలు, అదానీ టోటల్ గ్యాస్‌లో 2.84 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం 1,898 కోట్ల రూపాయలు , అదానీ గ్రీన్ ఎనర్జీలో 5.56 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం 2,806 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది.

Advertisement
Update:2023-03-04 07:12 IST

హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత లక్షల కోట్ల ఆస్తులు ఆవిరైపోయిన అదానీని కాపాడటానికి అమెరికాకు చెందిన GQG పాట్న‌ర్స్ అనే విదేశీ సంస్థాగత మదుపు సంస్థ ప్రయత్నిస్తోంది. అదానీ కంపెనీల షేర్ల ధరలు పాతాళాన్ని తాకుతున్న ఈ సమయంలో జిక్యుజి పాట్న‌ర్స్ సంస్థ అదానీ కంపెనీలలో 16 వేల కోట్ల రూపాయల పెట్తుబడులు పెట్టింది.

GQG సంస్థ‌ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 38,701,168 ఈక్విటీ షేర్ల కోసం 5,460 కోట్ల రూపాయలు, అదానీ పోర్ట్స్‌లో 8.86 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం 5,282 కోట్ల రూపాయలు, అదానీ టోటల్ గ్యాస్‌లో 2.84 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం 1,898 కోట్ల రూపాయలు , అదానీ గ్రీన్ ఎనర్జీలో 5.56 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం 2,806 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది.

దీంతో గురువారం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ దాదాపు 3% లాభపడగా, అదానీ పోర్ట్స్ 3.5% పెరిగింది. అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్ క్యాప్ ఒక్క రోజులో 30,170 కోట్ల రూపాయలకు పైగా పెరిగింది, అదానీకి చెందిన‌ 10 కంపెనీల మొత్తం షేర్ విలువ 7,86,342.14 కోట్లు రూపాయలయ్యింది..

GQG సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. అయితే ఏ సంస్థ అయినా తన షేర్ హోల్డర్లకు లాభాలు తెచ్చేందుకే పెట్టుబడులు పెడుతుంది తప్ప ఇలా నష్టాల్లో ఉన్న, రోజు రోజుకు దిగజారిపోతున్న అదానీ షేర్లను ఎందుకు కొనుగోలు చేసినట్టు ? 12 లక్షల కోట్ల ఆస్తులు ఆవిరయి పోయి, ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానం నుంచి 38వ స్థానానికి దిగజారిన అదానీని కాపాడటానికి ఒక అమెరికా సంస్థ ఎందుకు ప్రయత్నం చేస్తున్నట్టు. ఒక పెద్ద సంస్థ అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నదంటే తాము కూడా పెట్టొచ్చనే మనస్తత్వం ఉండే సాధారణ మదుపుదారులు ఇప్పుడు మళ్ళీ అదానీ కంపెనీ షేర్లు కొని అదానీని అగ్రస్థానానికి తీసుకెళ్ళాలనే కోరిక ఆ అమెరికా సంస్థకు ఎందుకుంది ?

ఎందుకంటే జిక్యుజి పార్ట్నర్స్ సంస్థ చైర్మన్, చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ భారతీయుడైన రాజీవ్ జైన్

తమ కంపెనీ అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం గురించి రాజీవ్ జైన్ మాట్లాడుతూ,

"ఈ కంపెనీలకు దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు గణనీయంగా ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాము భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ఇంధన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో అదానీ గ్రూపు గొప్పగా సహాయపడుతుంది. ఇలాంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం మాకు సంతోషంగా ఉంది." అన్నారాయన.

అదానీ కంపెనీలు నిజంగానే భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్దికి తోడ్ప‌డతాయా లేక అదానీ కంపెనీల అభివృద్దికి రాజీవ్ జైన్ తోడ్పడతున్నారా? అనేది త్వరలోనే తేలవచ్చు. అసలు ఈ రాజీవ్ జైన్ ఎవరు? అతను అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి గల అసలు ఉద్దేశాలు ఏంటి ? అతన్ని ప్రభావితం చేసింది ఎవరు ? ఈ అంశాలన్ని తేలాల్సి ఉన్నది.

Tags:    
Advertisement

Similar News