కర్నాటక సీఎం కుర్చీ ఆయనకే..! మరి కాసేపట్లో క్లారిటీ..

సీఎల్పీ భేటీకి కాస్త ముందుగా సిద్ధరామయ్య.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కలవడం ఆసక్తికర పరిణామం.

Advertisement
Update:2023-05-14 15:48 IST

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ సోలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతోంది. 135 సీట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపొందగా ఇప్పుడు కాంగ్రెస్ కి నాయకత్వం వహించేది ఎవరనే విషయంపై తర్జన భర్జన మొదలైంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీ సమావేశమై అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. అయితే అంతలోనే పార్టీ నేతల్లో హడావిడి మొదలైంది. సీఎం సీటు ఆశిస్తున్న డీకే శివకుమార్, సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరులో ఫ్లెక్సీలతో హడావిడి మొదలు పెట్టారు.

ఈరోజు ఉదయం నుంచి బెంగళూరులో ఇద్దరు నాయకుల అభిమానులు పలు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం పదవిలో తమ అభిమాన నాయకుడే ఉండాలని ఆ ఫ్లెక్సీల ద్వారా ఆకాంక్షించారు. రాష్ట్ర ఎన్నికల సమయంలో డీకే, సిద్ధరామయ్య వర్గాలు ఒకే తాటిపై నడిచాయి. పార్టీకి విజయాన్ని చేకూర్చాయి. ఫలితాల తర్వాత మాత్రం రెండు వర్గాలు తమ నాయకులకు అనుకూలంగా ఫ్లెక్సీలు వేస్తున్నాయి. సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర.. తన తండ్రికే సీఎం సీటు ఇవ్వాలని, ఆయనే దానికి అర్హుడంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. డీకే శివకుమార్ సోదరుడు సురేష్ కూడా తన సోదరుడిని సీఎం చేస్తే రాష్ట్రం సంతోషిస్తుందని అన్నారు. మరి ఈ ఇద్దరు ఆశావహుల విషయంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉందో చూడాలి.

కర్నాటక సీఎంని ఎంపిక చేసేందుకు మరికాసేపట్లో సీఎల్పీ భేటీ అవుతుంది. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఆల్రడీ బెంగళూరు చేరుకున్నారు. సీఎల్పీ నేతను ఎంపిక చేసేందుకు సుశీల్‌ కుమార్‌ శిండే, జితేంద్ర సింగ్‌, దీపక్‌ బబారియాలను కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలకులుగా నియమించింది. అయితే సీఎల్పీ భేటీకి కాస్త ముందుగా సిద్ధరామయ్య.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కలవడం ఆసక్తికర పరిణామం. ఇది మర్యాదపూర్వక భేటీయే అని చెబుతున్నా.. సీఎం సీటు విషయంలో వీరి మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు. అధిష్టానం నిర్ణయం ఏంటో మరి కాసేపట్లో తేలిపోతుంది. 

Tags:    
Advertisement

Similar News