హైడ్రోజన్ ట్రైన్ ఎలా పని చేస్తుంది? ఇండియాలో ఎక్కడ నడుపుతారు?

జర్మనీలో తొలి సారిగా 2018లో హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్‌ను నడిపించారు. ఇక 2022 అగస్టులో కేవలం హైడ్రోజన్ ట్రైన్లు మాత్రమే నడిచే ట్రాక్‌ను సిద్ధం చేశారు.

Advertisement
Update:2023-02-02 17:08 IST

ఇండియాలో ఈ ఏడాది చివరికల్లా హైడ్రోజన్ రైళ్లు ప్రవేశపెడతామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం చెప్పారు. ఈ సారి రైల్వే బడ్జెట్‌లో  వందే భారత్ కోసం భారీగానే నిధులు కేటాయించారు. పైగా.. రాబోయే రోజుల్లో 400 వందే భారత్ రైళ్లు తయారవుతాయని కూడా వివరించారు. ఇక దగ్గరి దూరాలకు 'వందే మెట్రో' అనే పేరుతో రైళ్లు తీసుకొని వస్తామని, ఇవి హైడ్రోజన్ ఇంజన్లతో పరుగులు తీస్తాయని వెల్లడించారు. సాంప్రదాయక ఇంధనమైన డీజిల్‌తో పాటు ఎలక్ట్రిసిటీ కాకుండా హైడ్రోజన్ ఇంజన్లు ఎలా నడుస్తాయి? ఇందుకు ఎంత ఖర్చు అవుతుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ సహాయంతో రూపొందించే లోకోమోటివ్‌లను ఉపయోగించి రైళ్లను నడిపిస్తారు. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ద్వారా మోటార్లను నడిపిస్తారు. హైడ్రోజన్, ఆక్సిజన్‌ను కన్వర్ట్ చేయడం ద్వారా ఫ్యూయల్ సెల్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ రైళ్లు ఏ మాత్రం కాలుష్యాన్ని వెదజల్లవు. సాధారణంగా డీజిల్ రైలు ఇంజన్ల నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువులు భారీగా విడుదల అవుతాయి. ఇవి పర్యావరణానికి ఎంతో హాని చేస్తాయి. అందుకే డీజిల్ బదులు హైడ్రోజన్ ఇంజన్లను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నది.

నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్‌ను వేరు చేయడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తారు. నీటిలో రెండు హైడ్రోజన్ అణువులు, ఒక ఆక్సిజన్ అణువు ఉంటుందనే విషయం తెలిసిందే. పునరుత్పాదక శక్తి అయిన గాలి, సోలార్, హైడ్రో పవర్‌ను ఉపయోగించి హైడ్రోజన్‌ను తయారు చేయవచ్చు. అయితే హైడ్రోజన్ ఫ్యూయల్‌ను విస్తృతంగా వాడాలంటే కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో గ్రీన్ హైడ్రోజన్ (పునరుత్పాదక శక్తి నుంచి తయారు చేసిన హైడ్రోజన్) కేజీ రూ.492గా ఉంది. ఇంత ధర పెట్టి కొని ఉపయోగిస్తే అది డీజిల్ ఖర్చు కంటే 27 శాతం అధికంగా ఉంటుంది. అంతే కాకుండా ఫ్యూయల్ సెల్స్ కొనుగోలు, హైడ్రోజన్ నిల్వకు అదనంగా ఖర్చ చేయాలి.

జర్మనీలో తొలి సారిగా 2018లో హైడ్రోజన్ పవర్డ్ ట్రెయిన్‌ను నడిపించారు. ఇక 2022 ఆగస్టులో కేవలం హైడ్రోజన్ ట్రెయిన్లు నడిచే ట్రాక్‌ను సిద్ధం చేశారు. రాబోయే రోజుల్లో జర్మనీ 15 హైడ్రోజన్ పవర్డ్ ఇంజన్లను డీజిల్ ఇంజన్ స్థానంలో రిప్లేస్ చేసి నడపాలని భావిస్తోంది. ఇంకా శైశవ దశలోనే ఉన్న ఈ టెక్నాలజీని ఇండియన్ రైల్వేస్ ఇంత త్వరగా అడాప్ట్ చేసుకోవడం వల్ల.. ఈ టెక్నాలజీని అందిస్తున్న సంస్థలు మన దేశానికి క్యూ కట్టే అవకాశం కూడా ఉంటుంది.

ఇండియాలో వందే మెట్రో పేరుతో నిర్వహించే ఈ హైడ్రోజన్ ట్రైన్లను తొలుత నారో గేజ్ (Narrow Gauge) రూట్లలో నడపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం డార్జిలింగ్, హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, ది కాల్కా సిమ్లా రైల్వే, ది మాథేరన్ హిల్ రైల్వే, ది కాంగ్రా వ్యాలీ, ది బిల్మోరా వాఘాయ్, మార్వార్-దేవ్‌ఘర్ మాడ్రియా లైన్‌లో డీజిల్ ఇంజన్లలో నేరో గేజ్ రైళ్లను నడిపిస్తున్నారు. వీటి వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోంది. కొండల ప్రాంతంలో ఉండటంతో గేజ్ పెంచి, ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి కూడా ఆటంకాలు ఉన్నాయి.

ఇలాంటి ప్రాంతాల్లో హైడ్రోజన్ ఫ్యూయల్ రైళ్లను ప్రవేశపెడితే మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ కలుగకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి స్థాయి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దగ్గరి ప్రాంతాలకు వందే మెట్రోను నడిపే అవకాశం కూడా ఉన్నది.

Tags:    
Advertisement

Similar News