స్థానిక అంశాలను విస్మరించాం.. మనలో ఐక్యత లోపించింది
హర్యానా, మహారాష్ట్రల్లో కాంగ్రెస్ ఓటమిపై మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు జాతీయాంశాలకే ప్రాధాన్యత ఇచ్చి స్థానిక అంశాలను విస్మరించిందని.. నాయకుల మధ్య ఐక్యత లోపించడంతోనే హర్యానా, మహారాష్ట్రల్లో ఓడిపోయాయని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శుక్రవారం ఢిల్లీలో పోస్ట్‌మార్టం నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ ఓటమిపై కాంగ్రెస్ చీఫ్ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలోని సంస్థాగత లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్‌లోనూ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. సొంత పార్టీ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకోవడం పార్టీని దెబ్బతీసిందన్నారు. మనలో మనమే తిట్టుకుంటే ప్రత్యర్థిని ఎలా ఓడించగలమని ప్రశ్నించారు. ఎన్నికలకు కనీసం ఏడాది ముందే పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయి పని ప్రారంభించి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడింది, ఆర్టికల్ 370 లాంటి అంశాలతో రాష్ట్రాల ఎన్నికలకు సంబంధం లేదని, కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా వాటిపై ఫోకస్ పెట్టడం ఓటమికి కారణాల్లో ఒకటి అన్నారు. పార్టీని ఇలాగే వదిలేస్తే నష్టం తప్పదని.. అందుకే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ప్రజాస్వామ్యంతోనూ సమస్యలు తలెత్తుతున్నాయని, క్రమశిక్షణ తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ గెలవాలంటే క్రమశిక్షణే ఆయుధమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పని చేసిందని, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చెప్పుకోదగ్గట్టుగా పని చేయలేదన్నారు. ఇండియా కూటమి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా మన పని తీరు సంతృప్తికరంగా లేదన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సమాయత్తం కావాలన్నారు. ఈవీఎంలతో ఓటింగ్ ప్రక్రియలో అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలోనూ ముందుండాలని సూచించారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందకుండా మరింత ఉత్సాహంగా పని చేయాలన్నారు. గ్రామ స్థాయి నుంచి ఏఐసీసీ వరకు సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉందన్నారు.