ఈ సలహా మనదే తమ్ముళ్లు- బాబు.. ఇంకా ఎవరేమన్నారంటే!

రూ. 2000 నోట్ల రద్దుపై విపక్షాలు మరోసారి నరేంద్రమోడీ సర్కార్‌పై విమర్శలకు దిగాయి. మరికొన్ని పార్టీలు అచితూచి స్పందించాయి.

Advertisement
Update:2023-05-20 07:18 IST

బ్లాక్‌ మనీ బయటకు తీయడంతో పాటు నకిలీ కరెన్సీకి చెక్ పెడుతామంటూ 2016లో నరేంద్రమోడీ వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేశారు. దాంతో ఒక్కసారిగా దేశం బ్యాంకుల ముందు బారులు తీరింది. కొన్ని రోజుల పాటు దేశ ప్రజలు అలజడికి గురయ్యారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒకవేళ తన ప్రయోగం విఫలమైతే ఉరి తీయండి.. కొద్దిగా టైం ఇవ్వండి అంటూ ప్రధాని మోడీ దేశ ప్రజలను బతిమలాడుకున్నారు. కానీ పెద్దనోట్ల రద్దు పక్రియ ఒక పెద్ద డిజాస్టర్‌ అన్నది గణాంకాలతో సహా ఆ తర్వాత నిరూపితమైంది. కరెన్సీ ఒత్తిడిని తట్టుకునేందుకు అప్పటికప్పుడు మరింత పెద్దదైన రూ.2000 నోటను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో పెద్దలంతా దర్జాగా పాత కరెన్సీని ఏసీ గదులను దాటకుండానే బ్యాంకుల సాయంతో మార్చేసుకున్నారు. ఏపాపం తెలియని సామాన్యులు మాత్రం రోజుల తరబడి రోడ్లపై నిలబడ్డారు.

అప్పట్లో రూ.2000 నోటును ప్రవేశపెట్టినప్పటికీ ఆ నోటుకు ఏ రోజైనా కాలం చెల్లడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతూనే వచ్చింది. పలు సందర్భాల్లో ఆ దిశగా పుకార్లు వచ్చాయి. అన్నింటికి మించి సామాన్యులకు 2000 నోట్లు కనిపించడం మానేసి చాలా కాలమైంది. ఎక్కడో తప్పించి విరివిగా అది అందుబాటులో లేదు. 2018 మార్చి 31 నాటికి మొత్తం కరెన్సీలో 37. 3 శాతం మేర అంటే 6.73 లక్షల కోట్ల రూపాయలు ఈ పెద్ద నోటు రూపంలోనే చలామణిలో ఉంది. 2023 మార్చి 31 నాటికి రెండు వేల నోటు చలామణి మొత్తం కరెన్సీలో 10.8 శాతానికి చేరింది. దీన్ని బట్టి పరోక్ష పద్దతిలో బ్యాంకుల ద్వారా ఈ నోటును ప్రజల్లోకి వెళ్లకుండా నియంత్రిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది.

తాజాగా రూ. 2000 నోట్ల రద్దుపై విపక్షాలు మరోసారి నరేంద్రమోడీ సర్కార్‌పై విమర్శలకు దిగాయి. మరికొన్ని పార్టీలు అచితూచి స్పందించాయి.

తమ్ముళ్లు నేనే చెప్పా- చంద్రబాబు

పెద్ద నోటు రద్దుపై చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబునాయుడు.. రూ. 2వేలు, రూ.500 నోట్లను రద్దు చేయాలని సలహా ఇచ్చింది తానేనని చెప్పారు. ఆ మేరకు ఆర్‌బీఐకి ఒక రిపోర్టును తాను అందజేసినట్టు వెల్లడించారు. తన రిపోర్టు ఆధారంగానే నేడు ఆర్‌బీఐ రూ.2 వేల నోటును రద్దు చేసిందని చంద్రబాబు చెప్పారు. రూ.500 నోటు కూడా రద్దు చేయాలని కోరారు.

మంచి నిర్ణయం- యనమల

రూ. 2వేల నోటు ఉపసంహరణ మంచి నిర్ణయమని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. దీని వల్ల రాబోయే ఎన్నికల్లో ధన ప్రభావం నియంత్రణలోకి వస్తుందన్నారు.

విశ్వగురు ఇదే తీరు- కాంగ్రెస్‌

విశ్వగురు అని చెప్పుకునే నరేంద్రమోడీ పనితీరుకు రూ.2వేల నోటు రద్దు ఒక ఉదాహరణ అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. తొలుత తోచింది చేసేయ్.. ఆ తర్వాత ఆలోచించు అన్న సూత్రాన్ని నరేంద్రమోడీ ఫాలో అవుతున్నారని విమర్శించింది. అప్పట్లో పెద్ద నోట్ల రద్దు ఒక మూర్ఖపు చర్య అయితే.. ఆ గాయానికి మందుపూతగా రూ.2వేల నోటు తెచ్చారని.. అప్పట్లో నోట్ల రద్దు విఫలమైనట్టుగానే ఇప్పుడు కూడా 2వేల నోటు రద్దు విఫలమవుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. 2016లో నరేంద్రమోడీ నిర్ణయం ఒక తుగ్లక్‌ ఫర్మానా అంటూ కాంగ్రెస్ అభివర్ణించింది. 2016 నాటి భూతం మరోసారి ప్రజలను వెంటాడేందుకు వచ్చిందంటూ వ్యాఖ్యానించింది.

రూ.2వేల నోటు రద్దు రద్దు ఊహించినదేనని.. ఈ నోటును కూడా వెనక్కు తీసుకుంటారని తాము 2016లోనే చెప్పామని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ట్వీట్ చేశారు. నోట్ల రద్దు సంపూర్ణమైందని... ఫలితం మాత్రం శూన్యమని విమర్శించారు. పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చిందన్నారు.

ఏం లాభమో చెప్పాలి- పవార్

రూ.2నోటును తీసుకురావడం ద్వారా.. తిరిగి ఇప్పుడు రద్దు చేయడం ద్వారా సాధించింది ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ డిమాండ్ చేశారు. నోట్ల రద్దు విజయవంతమైందని చెప్పుకున్న వారు ఇప్పుడు పెద్ద నోటు రద్దుకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News