మోడీ–పుతిన్ భేటీపై అమెరికా దౌత్యవేత్త తీవ్ర వ్యాఖ్యలు
యుద్ధం ఎవరికీ దూరం కాదని, శాంతి వైపు మనం నిలబడ్డామంటే అది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం కాకూడదని గార్సెట్టి చెప్పారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించి పుతిన్‌తో భేటీ కావడంపై భారత్‌లోని అమెరికా దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ రక్షణ సదస్సులో పాల్గొన్న ఆయన.. భారత్–అమెరికా మధ్య సంబంధాలు విస్తృతమైనవి, లోతైనవేనని, కానీ ఆ బంధాన్ని అలుసుగా తీసుకోవద్దని వ్యాఖ్యానించారు. భారత్ గురించి తనకు తెలుసని, వ్యూహాత్మక విషయాల్లో స్వేచ్ఛాయుత నిర్ణయాలు తీసుకునేందుకు న్యూఢిల్లీ ఇష్టపడుతుందని తెలుసని చెప్పారు. దానికి తాము పూర్తి గౌరవమిస్తామని తెలిపారు. కానీ.. ఘర్షణల వేళ వ్యూహాత్మక స్వేచ్ఛ అనేది ఏదీ ఉండదని, సంక్షోభ సమయాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవాలని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో పరస్పరం అండగా ఉండాలన్నారు.
అంతేకాదు.. యుద్ధం ఎవరికీ దూరం కాదని, శాంతి వైపు మనం నిలబడ్డామంటే అది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం కాకూడదని గార్సెట్టి చెప్పారు. శాంతియుత నియమాలను పాటించని వారి తంత్రాలను అడ్డుకునేలా కచ్చితమైన చర్యలు కూడా తీసుకోవాలని అన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ముప్పును ఒంటరిగా ఎదుర్కోవడం అనేది సాధ్యం కాదని తెలిపారు. మన బంధాన్ని గౌరవిస్తూ ప్రపంచ శాంతి కోసం సమష్టి చర్యలు చేపట్టాలి.. అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
మాస్కోలో మోడీ, పుతిన్ భేటీ అయిన సమయంలోనూ అమెరికా దీనిపై స్పందించిన విషయం తెలిసిందే. రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగించడంపై ఆందోళనలు ఉన్నప్పటికీ.. భారత్‌తో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేసింది. అయితే ఉక్రెయిన్ సంక్షోభం, నాటో శిఖరాగ్ర సదస్సు వేళ మోడీ మాస్కో వెళ్లడంపై బైడెన్ యంత్రాంగంలోని పలువురు సీనియర్ అధికారులు పెదవి విరిచినట్టు సమాచారం.