ఆన్సర్ షీట్‌లో ‘జై శ్రీరామ్’.. స్టూడెంట్స్ పాస్, ప్రొఫెసర్లు సస్పెండ్
యూనివర్సిటీ వీసీ వందన సింగ్ స్పందిస్తూ.. విద్యార్థులకు ఎక్కువ మార్కులు ఇచ్చారనే ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వింతైన సంఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం యూపీ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో కొందరు విద్యార్ధులు ఆన్సర్ షీట్స్‌లో జై శ్రీరామ్ నినాదాలతో పాటు, క్రికెటర్ల పేర్లను రాశారు. అయితే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఆ విద్యార్థులు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు. కొందరు ప్రొఫెసర్లు డబ్బులు తీసుకుని విద్యార్థులను పాస్ చేసినట్టు అక్కడి విద్యార్థి సంఘం నాయకుడు ఒకరు ఆరోపించారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి, గవర్నర్, వైస్ ఛాన్సలర్లకు లేఖ రాశారు. ఇందుకు ఆర్టీఐ స్పందించి జవాబు పత్రాలను రీ వ్యాల్యుయేషన్ చేయించింది. దీంతో అసలు విషయం బయటపడింది.
జాన్‌పూర్‌లోని వీర్ బహదూర్ పూర్వాంచల్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఈ పనికి పాల్పడినట్టు విచారణలో తేలింది. పై అధికారులు ఈ ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్ చేశారు.
ఈ విషయమై యూనివర్సిటీ వీసీ వందన సింగ్ స్పందిస్తూ.. విద్యార్థులకు ఎక్కువ మార్కులు ఇచ్చారనే ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులకు అదనపు మార్కులు ఇచ్చిన విషయాన్ని కమిటీ తన రిపోర్టులో పేర్కొందన్నారు. అయితే సమాధాన పత్రాల్లో జై శ్రీరామ్ నినాదాలు, విరాట్ కోహ్లీ, సచిన్ ల పేర్ల గురించి ప్రస్తావించగా తాను ఆ పత్రాలను ఇంకా చూడలేదని వీసీ తెలిపారు. కానీ అసంబద్ధ సమాధానాలకు మార్కులు కేటాయించినట్టు ఓ సమాధాన పత్రాన్ని తాను చూశానని అయితే ఆ పేపర్లో చేతిరాత కూడా అర్థం కాని విధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై గవర్నర్ కార్యాలయం కూడా స్పందించింది. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వీసీకి లేఖ రాసింది.