యూపీలో కానిస్టేబుల్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్.. రాష్ట్రమంతా రచ్చ
ఆరు నెలల్లో మళ్లీ పరీక్ష నిర్వహించాలని రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. పేపర్‌లీకేజ్ ఆరోపణలను సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్‌గా తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో కానిస్టేబుల్ నియామకాల రాత పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం లీకవ్వడంతో రాష్ట్రమంతా రచ్చరచ్చ జరిగింది. ఈనెల 18, 19 తేదీల్లో జరిగిన ఈ పరీక్షను ఏకంగా 48 లక్షల మంది రాశారు. అయితే ప్రశ్నపత్రం లీకయిందన్న సమాచారంతో అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కారు. వీరికి ప్రతిపక్షాలు తోడవడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దిగివచ్చింది. పరీక్ష రద్దుకు ఆదేశించింది.
ఆరు నెలల్లో మళ్లీ పరీక్ష
ఆరు నెలల్లో మళ్లీ పరీక్ష నిర్వహించాలని రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. పేపర్‌లీకేజ్ ఆరోపణలను సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే 240 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేవారిని వదిలేది లేదని సీఎం హెచ్చరించారు.
దెబ్బతిన్న ప్రభుత్వ ప్రతిష్ట
యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాజిటివ్ అంశాలే తప్ప ఎక్కడా నెగటివ్ లేకుండా నడిపిస్తున్నారు. అలాంటిది ఏకంగా అరకోటి మంది నిరుద్యోగులు నిద్రాహారాలు మాని పరీక్షకు సిద్ధమై రాస్తే.. ఆ పేపర్ లీకవడం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసింది. లక్నోలో అభ్యర్థులు భారీగా రోడ్డెక్కారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ అభ్యర్థులకు మద్దతుగా మాట్లాడటంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో పరీక్షను రద్దు చేశారు. కానీ యోగి ప్రభుత్వానికి ఇది మచ్చే.