రాజ్యాంగం భగవద్గీతేం కాదు.. మారిస్తే తప్పేంటి..?

వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తే, రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేపీ నేతలు అనంత్‌కుమార్‌ హెగ్డే, లల్లూ సింగ్‌, జ్యోతి మిర్దా, అరుణ్‌ గోవిల్‌ వ్యాఖ్యానించడం దుమారం రేపింది.

Advertisement
Update:2024-04-21 13:01 IST

కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దానికి బలం చేకూర్చేలా బీజేపీ నాయకుల వ్యాఖ్యలుంటున్నాయి. తాజాగా రాజ్యాంగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. రాజ్యాంగం భగవద్గీతేమీ కాదని, జాతి ప్రయోజనాల కోసం దాన్ని మారిస్తే తప్పేంటని అన్నారు.

"భారత రాజ్యాంగం భగవద్గీత ఏమీ కాదు. గీతలో శ్లోకాలను మార్చలేం. రాజ్యాంగంలో శ్లోకాలు లేవు కదా. జాతి ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తే తప్పేంటి?. రాజ్యాంగానికి సవరణలను గతంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా చేసింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370 రద్దు కూడా రాజ్యాంగ సవరణతోనే సాధ్యమైంది. దేశ ప్రయోజనాల కోసమే ఆ సవరణలు చేశాం" అన్నారు షెకావత్

వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తే, రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేపీ నేతలు అనంత్‌కుమార్‌ హెగ్డే, లల్లూ సింగ్‌, జ్యోతి మిర్దా, అరుణ్‌ గోవిల్‌ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ఇపుడు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావాత్‌ కూడా రాజ్యాంగ మార్పుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

"వాషింగ్ మెషిన్"- బీజేపీపై ఇటీవల వస్తున్న ప్రధాన విమర్శ. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరగానే, వారిపై కేసులు మాయమవుతున్నాయంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై కూడా షెకావత్‌ స్పందించారు. "బీజేపీ గంగానది లాంటిది. గంగ పిల్లకాలువలను తనలో కలుపుకున్నట్టే, మా పార్టీలో చేరాలనుకొనే అందర్నీ మేం తీసుకొంటాం. గంగలో చేరని పిల్ల కాలువ సూర్యతాపాన్ని భరించలేక చివరకు ఎండిపోవాల్సిందే" అంటూ పొంతనలేని సమాధానం ఇచ్చారు షెకావత్.

Tags:    
Advertisement

Similar News