ఇండియాలో ఉబర్ డ్రైవర్ల సంపాదన.. జస్ట్ 50 వేల కోట్లు
ఉబర్ ఇండియాలో అడుగుపెట్టి సరిగ్గా పదేళ్లు నిండాయి. ఈ పదేళ్లలో ఉబర్‌లో వాహనాలు పెట్టిన 8 లక్షల మంది డ్రైవర్లు 50 వేల కోట్ల రూపాయలకు పైగా సంపాదించుకున్నారని ఉబర్ ప్రకటించింది.
టాక్సీ అగ్రిగేటర్ యాప్ ఉబర్ గురించి మనందరికీ తెలుసు. కేవలం ట్యాక్సీలేకాక ఉబర్ మోటో పేరుతో టూ వీలర్ రైడ్స్, ఉబర్ ఆటో రైడ్స్ కూడా ఈ ఫ్లాట్‌ఫాంలో అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఉబర్ ఇండియాలో అడుగుపెట్టి సరిగ్గా పదేళ్లు నిండాయి. ఈ పదేళ్లలో ఉబర్‌లో వాహనాలు పెట్టిన 8 లక్షల మంది డ్రైవర్లు 50 వేల కోట్ల రూపాయలకు పైగా సంపాదించుకున్నారని ఉబర్ ప్రకటించింది.
30 లక్షల మంది డ్రైవర్లు
2013 ఆగస్టు 29న బెంగళూరులో ఉబర్ తొలి రైడ్ ప్రారంభించింది. ఇప్పుడు 125 నగరాల్లో ఆపరేషన్లు నడుస్తున్నాయని ఉబర్ ఇండియా, సౌత్ ఏషియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్‌సింగ్ చెప్పారు. 30 లక్షల మంది డ్రైవర్లు ఉబర్‌తో ఉపాధి పొందారని, ఇంకా పొందుతున్నారని ప్రకటించారు.
86 వేల చంద్రయాన్‌లు
ఉబర్ వాహనాలు ఇండియాలో ఇప్పటివరకు 3,300 కి.మీ. ప్రయాణించారు. భూమి నుంచి చంద్రునికి ఉన్న దూరం దాదాపు 3 లక్షల 80 వేల కి.మీ. ఆ లెక్కన తాము 86 వేల సార్లు చంద్రయాన్ చేసినంత దూరం తిరిగామని ప్రభ్‌జీత్‌సింగ్ చెప్పారు. ఇండియాలో ప్రయాణ తీరుతెన్నులను మార్చేశామని ఆయన చెప్పారు. నిజానికి ఉబర్, ఓలాలు వచ్చాక ప్రధానంగా నగరాల్లో ప్రయాణం ఎంతో సులువుగా, సౌకర్యంగా మారింది.
మమ్మల్ని ఉబర్ దోచుకున్నదే ఎక్కువంటున్న డ్రైవర్లు
ఉబర్ పదేళ్లలో 8 లక్షల మంది డ్రైవర్లకు 50 వేల కోట్లు ఇచ్చామని గొప్పలు చెబుతోందని, దానికంటే ఆ సంస్థ తమను పిండేసి సంపాదించుకున్నదే ఎక్కువని డ్రైవర్లు అంటున్నారు. ఉబర్‌కు ఒక్క కారు కానీ, ఆటోకానీ లేదని.. మా కార్లలో మేం డ్రైవింగ్ చేస్తుంటే కేవలం అగ్రిగేటర్‌గా ఉన్నందుకు 30% కమీషన్ తీసుకుంటుందని వాపోతున్నారు. తమకు కారు కొన్న ఈఎంఐలు, తమ రోజు జీతం చూసుకుంటే ఉబర్‌లో చేయడం నష్టమేనని, కానీ వినియోగదారులు వారికే అలవాటుపడటంతో తప్పలేదంటున్నారు. చాలాసార్లు ఉబర్‌లో కమీషన్ తగ్గించుకుని, తమకు ఆదాయం పెంచాలని రోడ్డెక్కిన సందర్బాలున్నాయని గుర్తు చేస్తున్నారు.