మహారాష్ట్రలో సత్యం, న్యాయం గెలిచింది.. విభజనవాదులు ఓడారు
విజయోత్సవ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్యం, న్యాయం గెలిచిందని.. విభజన వాదులు ఓడారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో శనివారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రధాని మోదీ మాట్లాడుతూ, మహారాష్ట్రలో విభజనవాదులు ఘోరంగా ఓడిపోయారని, కుటుంబ రాజకీయాలు ఓడిపోయారని అన్నారు. మరాఠ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. మరాఠ గడ్డపై ఇంతటి అద్భుత విజయం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. వరుసగా మూడోసారి బీజేపీని గెలిపించిన మరాఠ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో కూటమిని విజయతీరాలకు చేర్చిన సీఎం ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ కు అభినందనలు తెలిపారు. విభజిత రాజకీయాలు, కుట్రలు, అవినీతి చేసేవారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. జార్ఖండ్‌లో ఇంకా కష్టపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచి మరింత బలం పెంచుకుందన్నారు. దేశాభివృద్ధికి మహారాష్ట్ర ఇంజన్ లాంటిదని.. అలాంటి రాష్ట్రానికి మరాఠ ప్రజల వికాసం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పని చేయలేదన్నారు. దేశ ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, విభజన రాజకీయాలను ఎంతమాత్రం కాదని ఈ ఫలితంతో తేటతెల్లమైందన్నారు.