మహాకుంభ మేళాలో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు
మోడల్ ఆలయంలో భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
Advertisement
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈనెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించనున్న మహా కుంభమేళాలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు దర్శనమివ్వనున్నారు. కుంభమేళాలోని సెక్టార్ ఆరులోని వాసుకి ఆలయం పక్కన శ్రీవారి మోడల్ ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. కుంభమేళాకు వచ్చే భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఉత్తరాది భక్తుల కోసం ఈ మోడల్ ఆలయం ఏర్పాటు చేశామని చెప్పారు. తిరుమలలో చేసినట్టుగానే శ్రీవారి కళ్యాణోత్సవం, చక్రస్నానం సహా అన్ని కైంకర్యాలు చేపడుతామన్నారు. ఆయన వెంట టీటీడీ జేఈవో గౌతమి, సీవీఎస్‌వో శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, టీటీడీ సీఈ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
Advertisement