కాలం మారింది...భయం భయంగా బతుకుతున్న టెర్రరిస్టులు
ప్రజల కోసం ఎక్కువగా ఖర్చు చేయాలి. ప్రజల కోసం ఎక్కువగా పొదుపు చేయాలనేదే మా విధానమన్న ప్రధాని
గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పాలసీలు తీసుకొచ్చాయని ప్రధాని మోడీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించామని పేర్కొన్నారు. శనివారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో ప్రధాని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మోడీ ఉగ్రవాదం, తదితర అంశాలను ప్రస్తావించారు.
సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన 26/11 ముంబయి పేలుళ్ల కథనాలను మోడీ వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆ సమయంలో భారత ప్రజలు సురక్షితంగా లేరని చెప్పడానికి కొందరు ఉగ్రవాదాన్ని ఉపయోగించేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు ఉగ్రవాదులు వారి సొంతగడ్డపైనే అభద్రతాభావంతో ఉన్నారు. భయంభయంగా బతుకుతున్నారు. ఇక వారు మనల్ని భయపెట్టలేరు అన్నారు. ఈ సందర్భంగా విపక్షాలపై మోడీ మండిపడ్డారు. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఈ దేశ ప్రజలు మనల్ని నమ్మి మూడోసారి అవకాశం ఇచ్చారు. గత ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాలసీలను తీసుకొచ్చాయి. ఆ పరిస్థితిని మేం పోగొట్టాం. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాం. మా విధానాలతో ప్రజలను ఆశావహ దృక్పథంవైపు నడిపిస్తున్నాం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే అనే మంత్రంతో మా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ప్రజల కోసం ఎక్కువగా ఖర్చు చేయాలి. ప్రజల కోసం ఎక్కువగా పొదుపు చేయాలనేదే మా విధానం అని ప్రధాని వివరించారు.