మోదీ పదకొండేళ్ల పాలనలో ఒక్క సక్సెస్‌ స్టోరీ లేదు

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ రెడ్డి

Advertisement
Update:2024-11-18 15:03 IST

మోదీ పదకొండేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్క సక్సెస్‌ స్టోరీ లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పూణేలో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమి లేదన్నారు. వాళ్లు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టే బాంబు పేలుళ్లు, ఇతర కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నాయన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, దేశంలోని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని వాటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, దీనిపై ప్రధాని ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రైతులు, పేదలను ఆదుకోవడంలో ఉద్యోగాల కల్పనలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. తాను ఇచ్చిన హామీలను నెవవేర్చని మోదీ తెలంగాణ, కర్నాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హామీలపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హామీల అమలుపై తాను ప్రధానికి సవాల్‌ విసురుతున్న.. కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణకు ఒక కమిటీని పంపి హామీల అమలుపై అధ్యయనం చేయాలని, అవసరమైతే విమాన ఖర్చులు తామే భర్తిస్తామని అన్నారు. 50 రోజుల్లోనే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని, 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, పేద మహిళలకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నామని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని తెలిపారు. ఆ వివరాలన్నీ ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

రైతులకు ఎమ్మెస్పీకి అదనంగా క్వింటాల్‌ కు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. తాము ఖచ్చితమైన గ్యారంటీలు ఇచ్చామే తప్ప మోదీలా భారతీయ జూటా పార్టీ గ్యారంటీలు ఇవ్వలేదన్నారు. మహారాష్ట్రను మోదీ కోవర్ట్‌ రాజకీయాలకు అడ్డగా మార్చారని అన్నారు. సాధారణ కార్యకర్త శిందేను బాలాసాహెబ్‌ మంత్రి వరకు తీసుకువస్తే ఆయనను ఉద్దేవ్ వ్యతిరేకంగా, తనకు గులాంగా మోదీ మార్చారని, శరద్‌ పవర్‌ తన సొంత బిడ్డను కాదని సోదరుడి కుమారుడు అజిత్‌ పవార్‌ కు మంత్రి పదవులు ఇస్తే ఆయన మోదీకి గులాంగా మారారని, అశోక్‌ చవాన్‌ ను కాంగ్రెస్‌ సీఎంను చేస్తే ఆయనా మోదీకి గులాంగా మారారని మండిపడ్డారు. గుజరాత్‌ కు చెందిన ఇద్దరు మహారాష్ట్రను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఎన్నిక కాదు యుద్ధమన్న విషయం మరాఠా ప్రజలు గుర్తించాలన్నారు. అదానీకి మహారాష్ట్రను దోచిపెట్టడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 95 శాతం హిందువులు ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు బీజేపీని కాదని, కాంగ్రెస్‌ ను గెలిపించారని.. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌ను ఆదరిస్తారని అన్నారు.

Tags:    
Advertisement

Similar News