ఆ మూడు రాష్ట్రాల పనితీరు భేష్
వామపక్ష ఉగ్రవాదంపై పైచేయి సాధించాం : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
వామపక్ష ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో, పోలీసులు శక్తి సామర్థ్యాలు పెంపొందించడంలో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర పని తీరు భేష్ అని కేంద్ర హోం మంత్రి శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మావోయిస్టు ప్రభావ ప్రాంతాల సీఎంలు, మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. మావోయిస్టులు హింసతో సాధించేది ఏమీ లేదని, జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బహుముఖ వ్యూహంతో పని చేస్తూ మావోయిస్టు సమస్యను ఎదుర్కొంటున్నామని తెలిపారు. వామపక్ష ఉగ్రవాదంపై ఛత్తీస్‌గఢ్ లో పైచేయి సాధించామన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితోనే వికసిత్ భారత్ సాధ్యమన్నారు. ప్రభుత్వ ఫలాలు ఆదివాసీ, గిరిజన ప్రాంతాలకు చేరకుండా మావోయిస్టులు అడ్డు పడుతున్నారని చెప్పారు. రోడ్లు, టవర్లు, విద్య, వైద్యం కూడా వారికి చేరనీయడం లేదన్నారు. కొన్నేళ్లుగా మావోయిస్టుల సమస్యను ఎదుర్కోవడంలో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. మావోయిస్టుల హింసతో సంభవించిన మరణాలు క్రమేణ తగ్గుతున్నాయని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వ ఫలాలు వేగంగా చేరుతున్నాయని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులపై పోరాడుతున్న భద్రత బలగాలకు హెలీక్యాప్టర్ సేవలు అందుబాటులోకి తేవడం సత్ఫలితాలు ఇస్తుందన్నారు. కాల్పుల్లో గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించడం, రోడ్డు మార్గంలో చేరలేని ప్రాంతాలకు హెలీక్యాప్టర్ సేవలు ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. 2026 నాటికి మావోయిస్టుల సమస్యను రూపుమాపడమే లక్ష్యమని అమిత్ షా తెలిపారు. అర్బన్ నక్సల్స్ పై దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో తెలంగాణ, ఏపీ, ఒడిశా, పశ్చిమ బంగాల్, బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.