మహారాష్ట్ర తదుపరి సీఎం ప్రకటన మరింత ఆలస్యం!

ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడుతున్న మహాయుతి కూటమి

Advertisement
Update:2024-11-27 12:01 IST

మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించినా.. ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడుతూనే ఉన్నది. తదుపరి సీఎం ఎవరు అన్నదానిపై నిర్ణయం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో శాఖల కేటాయింపు, కీలక పదవులు ఖరారయ్యే వరకు సీఎం పేరును ప్రకటించవద్దని బీజేపీ యోచిస్తున్నది. ఏక్‌నాథ్‌ శిండే రాజీనామా చేసిన తర్వాత ఆపధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్‌ సూచించడం దీనికి బలాన్ని చేకూరుస్తున్నది. సీఎం పేరును ప్రకటించడంలో కేంద్ర నాయకత్వం తొందరపడటం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ సీనియర్‌ నేత తెలిపారు. మంత్రిత్వ శాఖలు, జిల్లాల ఇన్‌ఛార్జి వంటి పదవుల ఖరారు, ప్రభుత్వ ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక రూపొందించడమే తమ ప్రాధాన్యం అన్నారు. భాగస్వామ్యపక్షాల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండటానికి అధిష్టానం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదని, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆ వ్యవహారాలతో పాటు, మహారాష్ట్ర నేతలతోనూ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నదని చెప్పారు. 

 మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మహాయుతిలో భాగమైన కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే దేవేంద్ర ఫడ్నవీస్‌ను తదుపరి సీఎంగా సమర్థించారు. ఏక్ నాథ్‌ శిండే కేంద్ర ప్రభుత్వంలో చేరాలని అథవాలే ప్రతిపాదించారు. ఒకవేళ శిండే తిరస్కరించినట్లయితే బీజేపీ-ఎన్‌సీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అథవాలే సూచించారు.

Tags:    
Advertisement

Similar News