ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి.. ముగ్గురు సైనికులు మృతి

పుల్వామా జిల్లాలో రోడ్డు పక్కన 25 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించి ఉగ్ర కుట్రను భగ్నం చేశారు జవాన్లు. బడ్‌ గామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. తాజాగా ఆర్మీ క్యాంప్‌ని టార్గెట్ చేసుకుని దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement
Update:2022-08-11 12:04 IST

భారత్‌లో స్వాతంత్య్ర‌ వజ్రోత్సవ సంబరాలు మొదలవుతున్న వేళ.. ఉగ్రవాదుల కుట్రలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో పార్గల్‌ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి జరిగింది. ఫెన్సింగ్‌ దాటి లోపలికి వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. క్యాంప్‌లో ఆత్మాహుతి దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. అయితే వీరిని గుర్తించిన ఆర్మీ సెంట్రీ వెంటనే కాల్పులు మొదలుపెట్టారు. అంతలో భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమై ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే నేలకొరిగారు. ఆ తర్వాత సైన్యం కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు భారత జవాన్లు గాయపడ్డారు.

స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని టార్గెట్ చేసుకుని ఉగ్రమూకలు బరితెగించే ప్రమాదం ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో సైన్యం కూడా అప్రమత్తమైంది. సరిహద్దుల్లోనే కాకుండా దేశంలోని పలు ప్రముఖ పట్టణాల్లో కూడా ఉగ్రదాడులు జరిగే అవకాశముందని తేలడంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా హై అలర్ట్ ప్రకటించాయి. బుధవారం పుల్వామా జిల్లాలో రోడ్డు పక్కన 25 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించి ఉగ్ర కుట్రను భగ్నం చేశారు జవాన్లు. బడ్‌ గామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. తాజాగా ఆర్మీ క్యాంప్‌ని టార్గెట్ చేసుకుని దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది.

ఆత్మాహుతి దాడులు..

ఆత్మాహుతి దాడులతో అలజడి సృష్టించాలనేది ఉగ్రమూకల పన్నాగంగా స్పష్టమైంది. ఆర్మీ క్యాంప్‌పై నేరుగా దాడి చేసి భారీగా సైన్యానికి నష్టం కలిగించాలనే ప్లాన్‌తో పార్గల్ క్యాంప్ పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఆత్మాహుతి జరిగి ఉంటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేది. కానీ ఆలోగా సైన్యం చేతుల్లో ఆత్మాహుతి దళ సభ్యులు హతం కావడం సంతోషించదగ్గ పరిణామం. అయితే ముగ్గురు జవాన్లు ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు కోల్పోవడం మాత్రం స్వాతంత్య్ర‌ ఉత్సవాల వేళ విచారకరమైన‌ అంశం.

Tags:    
Advertisement

Similar News