వివాహం తర్వాత మహిళా ఉద్యోగి తొలగింపు.. రూ.60లక్షలు చెల్లించాలంటూ సుప్రీం ఆదేశం
వివాహాన్ని సాకుగా చూపి మహిళను ఉద్యోగంలో నుంచి తొలగించడం లింగ వివక్షతను చూపించడమే అవుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
వివాహాన్ని సాకుగా చూపి మహిళను ఉద్యోగంలో నుంచి తొలగించడం లింగ వివక్షతను చూపించడమే అవుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లింగ వివక్షను చూపే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమతించబోదని స్పష్టం చేసింది.
సైన్యంలో నర్సుగా సేవలు అందిస్తోన్న ఓ మహిళను వివాహం అనంతరం విధ తొలగించిన కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే బాధిత మహిళకు రూ.60 లక్షల బకాయిలు చెల్లించాలని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
సెలినా జాన్ అనే నర్సు సైన్యంలో విధులు నిర్వహిస్తూ ఉండేది. ఆమెకు MNSలో లెఫ్టినెంట్ స్థాయి హోదాకి కమిషన్ మంజూరు చేయబడింది. ఆమె ఆర్మీ అధికారి మేజర్ వినోద్ రాఘవన్‌ను వివాహం చేసుకుంది. అయితే, ఆమె లెఫ్టినెంట్ హోదాలో పనిచేస్తున్నప్పుడు ఆర్మీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించింది. ఎలాంటి షోకాజ్ నోటీసు లేకుండా, ఆమె వాదన వినకుండా సేవలను రద్దు చేసింది. అంతే కాకుండా పెళ్లి కారణంగా ఆమెను విధులనుంచి విడుదల చేసినట్టుగా ఆ ఆర్డర్‌లో పేర్కొంది.
ఈ విషయంపై బాధిత మహిళ 2012లో సాయుధ దళాల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాలపై 2019లో అత్యున్నత న్యాయస్థానం లో కేంద్రం సవాలు చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. ట్రైబ్యునల్ తీర్పులో ఎలాంటి జోక్యం అవసరం లేదని తేల్చిచెప్పింది.
వివాహ కారణాలతో మిలటరీ నర్సింగ్ సర్వీస్ నుండి తొలగించడం అనే రూల్ 1977లో ప్రవేశపెట్టినప్పటికీ ఆ నిబంధనను 1995లో ఉపసంహరించుకున్నట్లు కోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసు వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, బాధిత మహిళకు 8 వారాల్లోగా రూ.60,00,000/- (అరవై లక్షలు ) పరిహారం చెల్లించమని కేంద్రాన్ని ఆదేశించింది.