విప్ ధిక్కరించిన పది మంది బీజేపీ ఎంపీలు
లోక్‌సభకు డుమ్మా కొట్టిన కమలం పార్టీ సభ్యులు
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో బీజేపీ తమ ఎంపీలను విప్ జారీ చేసింది. సభ్యులందరూ లోక్‌సభకు హాజరుకావాలని ఆదేశించింది. పార్టీ విప్ ను ధిక్కరించి పది ఎంపీలు మంగళవారం లోక్‌సభకు డుమ్మా కొట్టారు. వారిలో కేంద్ర మంత్రులు ఉన్నారు. బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ పార్టీ లోక్‌సభ సభ్యులకు విప్ జారీ చేశారు. మంగళవారం తప్పనిసరిగా లోక్‌సభకు హాజరుకావాలని విప్ లో స్పష్టం చేశారు. జైపూర్ పర్యటన నేపథ్యంలో లోక్‌సభ సమావేశాలకు హాజరు కావడం లేదని ప్రధాని నరేంద్రమోదీ ముందే చీఫ్ విప్ కు సమాచారం ఇచ్చారు. బీజేపీ వర్గాల సమాచారం మేరకు.. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింథియా, గిరిరాజ్ సింగ్, శాంతను ఠాకూర్, ఎంపీలు జగదాంబికా పాల్, రాఘవేంద్ర ద్వారా, విజయ్ భగేల్, ఉదయ్ రాజే భోస్లే, జగన్నాథ్ సర్కార్, జయంత్ కుమార్ రాయ్ సభకు హాజరుకాలేదు. కేంద్ర మంత్రులతో పాటు సభకు హాజరుకాని కొందరు ఎంపీలు ఏయే కారణాలతో రాలేకపోతున్నామో చీఫ్ విప్‌కు సమాచారం ఇచ్చారని బీజేపీ ముఖ్య నేతలు చెప్తున్నారు. సమాచారం ఇవ్వకుండా సభకు గైర్హాజరు అయిన వారి నుంచి చీఫ్ విప్ వివరణ కోరుతారని, వారు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలుంటాయని చెప్తున్నారు.