అదానీ అవార్డు నాకొద్దు.. తమిళ రచయిత్రి ఆత్మాభిమానం
హిండెన్ బర్గ్ నివేదిక ద్వారా అదానీ ఆర్థిక నేరాల గురించి ఇటీవలే తనకు తెలిసిందని.. అందుకే పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేనని తెలిపారామె.
అవార్డులు రివార్డులు అంటే పరిగెత్తుకెళ్లేవారు చాలామందే ఉంటారు. కానీ ఆమె అలా చేయలేదు, ఆలోచించింది, ఆత్మాభిమానంతో వెనకడుగు వేసింది. ఆ అవార్డు వద్దు అని చెప్పేసింది. పురస్కారాలిచ్చేవారు బతిమిలాడారు, కానీ కుదరదు పొమ్మన్నది. మీరిచ్చే అవార్డు నాకు అక్కర్లేదు అని తేల్చి చెప్పింది. దీనికి కారణం ఒకటే. ఆ అవార్డు కార్యక్రమానికి అదానీ ప్రధాన స్పాన్సర్ కావడం.
‘దేవి’ పురస్కారం తిరస్కరణ..
దేశవ్యాప్తంగా పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలకు న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు ప్రతి ఏడాదీ ‘దేవి’ పురస్కారాలను అందిస్తుంది. ఈ ఏడాది పురస్కారాలకు ఎంపిక చేసిన 12 మంది మహిళల్లో తమిళనాడుకు చెందిన కవయిత్రి సుకీర్త రాణి ఉన్నారు. సాహిత్యం, దళిత సాహిత్యంలో చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారానికి సుకీర్త రాణిని ఎంపిక చేశారు. అయితే ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి పారిశ్రామికవేత్త అదానీ ప్రధాన స్పాన్సర్ అని సుకీర్త రాణికి తెలిసింది. దీంతో ఆమె ‘దేవి’ పురస్కారాన్ని తిరస్కరించినట్టు సదరు సంస్థకు వర్తమానం పంపారు. హిండెన్ బర్గ్ నివేదిక ద్వారా అదానీ ఆర్థిక నేరాల గురించి ఇటీవలే తనకు తెలిసిందని.. అందుకే పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేనని తెలిపారామె.
తమిళనాడు రాణిపేట జిల్లా లాలాపేటకు చెందిన సుకీర్త రాణి ఉపాధ్యాయురాలు. పాఠ్య పుస్తకాలతోపాటు, ఇతర సాహిత్య పుస్తకాలు ఆమె రాశారు. ఆమె కవితలు సమకాలీన రాజకీయాలను ప్రతిబింబిస్తాయి, ఆలోచింపజేస్తాయి. 25 ఏళ్లుగా మహిళా హక్కులు, దళిత విముక్తి, స్త్రీ స్వేచ్ఛ, అణచివేతకు గురైన ప్రజల కోసం రచనలు కొనసాగిస్తున్నారు సుకీర్త రాణి. అదానీ స్పాన్సర్ గా ఉన్న ‘దేవి’ పురస్కారాన్ని తిరస్కరించి మరోసారి వార్తల్లోకెక్కారామె.