మొన్న వలంటీర్లు.. నిన్న కోలీవుడ్‌తో పవన్ కయ్యం
బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమిళ సినీ ఇండస్ట్రీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కోలీవుడ్‌లో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ పెట్టారనే తప్పుడు ప్రచారం సాగుతోందని నాజర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఏపీలో వారాహి యాత్ర చేస్తూ వలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేసి కేసులు ఎదుర్కొంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా కోలీవుడ్ (తమిళ చిత్ర పరిశ్రమ)తో కయ్యానికి కాలు దువ్వారు. అటు వలంటీర్లు నిరసనలు, కేసులతో పవన్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇటు కోలీవుడ్ నుంచి కూడా నిరసన సెగలు మొదలయ్యాయి.
కోలీవుడ్ సినిమాల్లో తమిళులకే అవకాశాలు ఇవ్వాలని కోలీవుడ్ సినీపరిశ్రమ సంఘాలు తీర్మానించడం సరికాదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు నాజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళభాషేతర నటులని తమిళ సినిమాలలో తీసుకోకూడదనే నిర్ణయాన్ని ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా తీసుకుందని, దీనిని వెనక్కి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ వివరణ ఇచ్చినట్టే పవన్ ని పరోక్షంగా తప్పుబట్టారు.
బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమిళ సినీ ఇండస్ట్రీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కోలీవుడ్‌లో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ పెట్టారనే తప్పుడు ప్రచారం సాగుతోందని నాజర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వేళ అలాంటి నిబంధన తీసుకువస్తే నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ముందు తానే ఆ నిబంధనలను వ్యతిరేకిస్తానన్నారు. ఏ సినీ పరిశ్రమ అయినా, నటులు, కళాకారులకి ఏ ఆంక్షల హద్దులు ఉండవని నాజర్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ కి ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
తమిళ సినిమా చేస్తున్నప్పుడు తమిళ సాంకేతికనిపుణులని పెట్టుకోవాలని సెల్వమణి సలహా ఇచ్చారని, అంటే వేరే పరిశ్రమ నటులని తీసుకోకూడదని కాదని వివరణ ఇచ్చారు. పాన్ ఇండియా మూవీలు, ఓటీటీల వెల్లువ కాలంలో ఇటువంటి నిబంధనలు ఎవరూ తీసుకొచ్చినా అవి అర్థంలేనివన్నారు. ప్రపంచమే మన సినిమాల కోసం ఎదురుచూస్తోందని, బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లతో మనకి రాజమౌళి కొత్త దారి చూపించారని నాజర్ చెప్పుకొచ్చారు. తమిళ్‌లో ఎస్వీ రంగారావు, సావిత్రి, వాణిశ్రీ, శారద వంటి ప్రఖ్యాత నటులు కోలీవుడ్ సినిమాలలో తమ నటనతో అలరించారన్నారు. అంతా కలిసి అద్భుతమైన సినిమాలు చేద్దామని పిలుపునిచ్చారు.