బెయిల్ రద్దు నిర్ణయాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బెయిల్ మంజూరు ఉత్తర్వులను అసాధారణ కేసుల్లో మాత్రమే కోర్టు నిలిపివేస్తుందని.. చాలా బలమైన కారణాలుంటే తప్ప బెయిల్ రద్దు కుదరదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
బెయిల్ రద్దు నిర్ణయాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడికి ఇచ్చిన స్వేచ్ఛలో కోర్టులు జోక్యం చేసుకోలేవని తెలిపింది. ఓ నిందితుడి బెయిల్‌పై స్టే ఇచ్చే విషయంలో హైకోర్టులు, సెషన్స్ కోర్టులు నిదానంగా వ్యవహరించాలని పేర్కొంది. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే ’బెయిల్ రద్దు’ నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
నగదు అక్రమ రవాణా కేసులో పర్వీందర్ సింగ్ ఖురానా అనే నిందితుడికి ట్రయల్ కోర్టు గతేడాది జూన్ 17న బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్‌ని ఢిల్లీ హైకోర్టు జూన్ 7న తాత్కాలికంగా నిలిపివేయగా.. పర్వీందర్ సింగ్ ఖురానా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన బెంచ్ ఖురానా బెయిల్‌ను పునరుద్ధరిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
బెయిల్ మంజూరు ఉత్తర్వులను అసాధారణ కేసుల్లో మాత్రమే కోర్టు నిలిపివేస్తుందని.. చాలా బలమైన కారణాలుంటే తప్ప బెయిల్ రద్దు కుదరదని ధర్మాసనం తేల్చిచెప్పింది. లేకపోతే ఆర్టికల్ 21 ప్రశ్నార్థకమవుతుందని తెలిపింది. హైకోర్టులు గానీ, సెషన్స్ కోర్టులు గానీ సహేతుక కారణాలు లేకుండా బెయిల్ ఆర్డర్‌పై స్టే ఇస్తే అది.. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించినట్టేనని పేర్కొంది. బెయిల్ రద్దుకు దరఖాస్తు చేసినప్పుడు హైకోర్టు లేదా సెషన్స్ కోర్టులు స్టే ఇచ్చి మధ్యంతర ఉపశమనం కలిగించేందుకు నిదానంగా వ్యవహరించాల్సి ఉంటుందని సూచించింది. కొన్ని సందర్భాల్లో నోటీసులు ఇచ్చి, మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ నిందితుడు పారిపోకుండా అదనపు షరతులు విధించవచ్చని తెలిపింది. బెయిల్ మంజూరు చేసే ఆర్డరుపై స్టే ఇవ్వవద్దనే ప్రామాణిక నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది. పరిస్థితుల డిమాండును బట్టే వ్యక్తి స్వేచ్ఛను నియంత్రించే ఉత్తర్వులు ఇవ్వాలని తెలిపింది.