ఆ నిబంధన వివక్ష కాదు.. - తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

రాజస్థాన్‌కు చెందిన రామ్‌ లాల్‌ జాట్‌ గతంలో సైన్యంలో పనిచేసి 2017లో పదవీ విరమణ పొందారు. అనంతరం కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement
Update:2024-02-29 20:46 IST

రాజస్థాన్‌ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న ‘ఇద్దరు పిల్లల’ నిబంధనలో వివక్ష లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ నిబంధనను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఈ సందర్భంగా న్యాయస్థానం కొట్టివేసింది. రాజస్థాన్‌ రాష్ట్రంలో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. ఈ నిబంధన గత కొన్ని సంవత్సరాలుగా ఆ రాష్ట్రంలో అమలులో ఉంది. తాజాగా ఈ నిబంధనను సమర్థించిన సుప్రీంకోర్టు.. ఇందులో ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగ ఉల్లంఘన కూడా కాదని తెలిపింది.

రాజస్థాన్‌కు చెందిన రామ్‌ లాల్‌ జాట్‌ గతంలో సైన్యంలో పనిచేసి 2017లో పదవీ విరమణ పొందారు. అనంతరం కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నారు. అతనికి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండటంతో అతని దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాజస్థాన్‌ హైకోర్టు 2022లోనే అతని పిటిషన్‌ను కొట్టివేసింది. ఇది విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీనిపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ’ఇద్దరు పిల్లల’ నిబంధనను సమర్థించింది. ‘ఇందులో ఎలాంటి వివక్షా లేదని స్పష్టం చేసింది. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ నిబంధన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదని తెలిపింది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల కోసం ఈ నిబంధన తీసుకురాగా సుప్రీంకోర్టు దానిని ఆమోదించిందని ఈ సందర్భంగా న్యాయస్థానం గుర్తుచేసింది.

Tags:    
Advertisement

Similar News