మ‌మ‌త మేన‌ల్లుడి అభ్య‌ర్థ‌న తిర‌స్క‌రించిన సుప్రీంకోర్టు

తనపై ఈడీ, సీబీఐ విచారణను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన చేసిన అభ్యర్థ‌నను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

Advertisement
Update:2023-07-11 08:38 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసులో తనపై ఈడీ, సీబీఐ విచారణను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన చేసిన అభ్యర్థ‌నను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈడీ, సీబీఐల విచారణ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది.

ఆయనపై దర్యాప్తు సంస్థలు విచారణను కొనసాగించవచ్చంటూ గతంలో కోల్‌క‌తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి. ఎస్. నరసింహల ధర్మాసనం సోమవారం తమ తీర్పును వెలువరించింది. అయితే అభిషేక్ బెనర్జీ చట్ట ప్రకారం తనకున్న అవకాశాలను వినియోగించుకోవచ్చని పేర్కొంది.

బుల్డోజ‌ర్ పాల‌న‌పై పిటిష‌న్లు ధ‌ర్మాసనం ఎదుట‌కు..

పలు కేసుల్లో నిందితులైన వారి ఇళ్లను కూల్చివేసే బుల్డోజర్ల విధానాన్ని అడ్డుకోవాల‌ని కోరుతూ జమియత్ ఉలేమా-ఇ-హింద్ పాటు కొంత మంది వేసిన‌ పిటిషన్లు సోమ‌వారం ధ‌ర్మాసనం ముందుకు వ‌చ్చాయి. న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ జె. బి. పార్థీవాలాలతో కూడిన ధర్మాసనం వీటిని ప‌రిశీలించి సెప్టెంబ‌రులో వీటిపై విచార‌ణ చేస్తామ‌ని పేర్కొన్నారు. బుల్డోజ‌ర్ల విధానాన్ని ప‌లు రాష్ట్రాలు అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News