ఈ కేసులో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వలేం.. సుప్రీంకోర్టు వెల్లడి
తొలుత చండీగఢ్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ప్రయోజనం కనిపించలేదు. తలకు బలమైన గాయం కావడంతో అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు.
తమ కుమారుడి కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌కి మద్దతుగా తీర్పు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ఇది చాలా కఠినమైన కేసని, ఈ కేసులో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. దశాబ్దానికి పైగా మంచానికే పరిమితమైన కుమారుడిని చూసుకునేందుకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించింది. ఏదైనా సంస్థ బాధితుడి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటుందేమో తెలుసుకోవాలని కేంద్రాన్ని కోరింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే.. అశోక్ రాణా, నిర్మలాదేవి దంపతుల కుమారుడు హరీష్ రాణా 2013 ఆగస్టు 3వ తేదీన ప్రమాదానికి గురయ్యాడు. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. హరీష్ పేయింగ్ గెస్ట్ భవనంలో ఉంటూ చదువుకునేవాడు. ఆరోజు సాయంత్రం 7 గంటల సమయంలో అదే పేయింగ్ గెస్ట్ భవనం నాలుగో అంతస్తు నుంచి అతను కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. ఈ విషయంపై తల్లిదండ్రులకు సమాచారం అందడంతో తొలుత చండీగఢ్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ప్రయోజనం కనిపించలేదు. తలకు బలమైన గాయం కావడంతో అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు.
తల్లిదండ్రులు కుమారుడికి ఇంటి వద్దే చికిత్స అందించేవారు. పైపుల (రైల్స్ ట్యూబ్) ద్వారా ఆహారం, మెడిసిన్ శరీరంలోకి పంపించేవారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చయ్యేది. ఉన్న ఆస్తులను అమ్మి చికిత్స అందించినా.. కుమారుడిలో ఎలాంటి మార్పూ కనిపించకపోవడంతో కుమారుడి కారుణ్యం మరణానికి అవకాశం కల్పించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. తాజాగా వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మంగళవారం వారి పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. రైల్స్ ట్యూబ్ తొలగింపు కారుణ్య మరణంలో భాగం కాదని, రైల్స్ ట్యూబ్ తీసివేస్తే రోగి ఆకలితో మరణిస్తారని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.
ఇది చాలా హృదయవిదారకమైన కేసని, పిటిషన్‌దారులకు మద్దతుగా తీర్పు ఇవ్వలేమని బెంచ్ తెలిపింది. అలాగని చూస్తూ ఉండిపోబోమని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు 13 ఏళ్లుగా కష్టపడుతున్నారని, తమ కుమారుడి వైద్య బిల్లులు భరించలేకపోతున్నారని సీజేఐ తెలిపారు. తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పిస్తూ కుమారుడి బాగోగులు చూసుకునేందుకు ఏదైనా శాశ్వత పరిష్కారం చూపిస్తుందా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని బెంచ్ ఈ సందర్భంగా అభ్యర్థించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఆరోగ్య మంత్రిత్వ శాఖను సంప్రదిస్తామని తెలిపారు.