సిసోదియాకు బెయిల్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సిసోదియా బెయిల్ నేపథ్యంలో కవిత బెయిల్ విషయంలో సానుకూల తీర్పు వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

Advertisement
Update:2024-08-09 11:54 IST

లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీష్ సిసోదియాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరని ఈ సందర్భంగా సుప్రీం పేర్కొంది. కేసు విచారణలో పురోగతి లేకపోతే, కాల పరిమితి దాటిన తర్వాత కూడా ఆ నిందితుడిని జైలులో బంధించడం సరికాదని తెలిపింది. అది ఆ వ్యక్తి హక్కులను హరించడమే అవుతుందని స్పష్టం చేసింది. ‘బెయిల్‌ అనేది నియమం.. జైలు మినహాయింపు’ అనే విషయాన్ని ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

లిక్కర్ కేసులో అరెస్ట్ తర్వాత 17నెలలపాటు మనీష్ సోసిదియా జైలు జీవితం గడిపారు. ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం, వద్దంటూ సీబీఐ సమాధానమివ్వడం.. 17నెలలుగా ఇదే జరుగుతోంది. అయితే ఆయన నేరం చేసినట్టుగా ఇప్పటి వరకు సీబీఐ నిరూపించలేకపోవడం విశేషం. ఈ క్రమంలో ఆయనకు బెయిలిస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్వాగతించారు. సుప్రీం వ్యాఖ్యలు నియంతృత్వానికి చెంపదెబ్బ అని అన్నారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆప్ నేత సత్యేందర్‌ జైన్‌కు కూడా త్వరలోనే బెయిల్ పై బయటకొస్తారని ఆ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ప్రస్తుతం జైలులో ఉన్నారు. మార్చి-15న ఆమెను హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం సీబీఐ కూడా ఆమెపై అభియోగాలు మోపింది. ఆమె బెయిల్ పిటిషన్లు కూడా వరుసగా తిరస్కరణకు గురవుతున్నాయి. సిసోదియా బెయిల్ నేపథ్యంలో కవిత బెయిల్ విషయంలో సానుకూల తీర్పు వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. 

Tags:    
Advertisement

Similar News