నేర విచారణ నుంచి గవర్నర్‌కు మినహాయింపు వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఆమె పిటిషన్‌ను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Advertisement
Update:2024-07-20 09:11 IST

నేర విచారణ నుంచి గవర్నర్‌కు మినహాయింపు కల్పించే అంశంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై న్యాయ సమీక్షకు ధర్మాసనం అంగీకరించింది. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌పై ఇటీవల ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో నేర విచారణ నుంచి గవర్నర్‌కు మినహాయింపు కల్పించే ఆర్టికల్‌ 361 రాజ్యాంగ నిబంధనను పరిశీలించేందుకు అంగీకరించింది.

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తున్న ఓ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాధిత మహిళ.. గవర్నర్లకు రక్షణ కల్పించే రాజ్యాంగంలోని 361వ అధికరణపై న్యాయ సమీక్ష చేయాలని అభ్యర్థించారు. నేర విచారణ నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 

ఆమె పిటిషన్‌ను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంలో తమకు కోర్టు సాయం చేయాలని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణిని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 కింద.. రాష్ట్రపతి లేదా గవర్నర్‌ తన అధికారాలు, విధులను నిర్వర్తించే విషయంలో ఏ కోర్టుకూ జవాబుదారీగా ఉండరు. ఉద్యోగం విషయంలో ప్రయోజనాలు చేకూర్చుతానన్న నెపంతో గవర్నర్‌ ఆనంద బోస్‌ తనను పలుమార్లు వేధించారని ఈ ఏడాది మే నెలలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను గవర్నర్‌ కార్యాలయం ఖండించింది. పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కావాలనే ప్రభుత్వం తనపై ఇలాంటి కుట్రలు పన్నుతోందని గవర్నర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News