బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి

తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడంపై 14న రౌండ్‌ టేబుల్‌ సమావేశం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Advertisement
Update:2024-12-12 17:56 IST

బీజేపీకి తెలంగాణపై ప్రేమ ఉంటే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లో ఆమె నేషనల్‌ మీడియాతో మాట్లాడారు. "బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు" అంటూ కేసీఆర్‌ డిమాండ్‌ చేస్తున్నారని గుర్తు చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించడం బాధకరమన్నారు. 2013లోనే అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు కేసీఆర్‌ లేఖ రాశారని గుర్తు చేశారు. బయ్యారం సమీపంలోని 1.41 లక్షల ఎకరాల్లో 300 మిలియన్‌ టన్నుల ఐరన్‌ ఓర్‌ నిల్వలు ఉన్నాయని తెలిపారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తే స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ హామీని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పదేళ్లకు పైగా నెరవేర్చలేదన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు అనేక పర్యయాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇక్కడి ఐరన్‌ ఓర్‌లో నాణ్యత లేదని కేంద్రం సాకు చూపితే.. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వంద టన్నుల ఐరన్‌ ఓర్‌ తెప్పించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారని, ఇప్పుడు మంత్రిగా ఉండి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

14న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం, తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దాడి చేయడంపై ఈనెల 14న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఉత్సవాల్లో విష సంస్కృతిని ప్రవేశపెట్టడం, ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని రూపుమాపే ప్రయత్నాలు చేయడంపై మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులతో కవిత ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.

కవితను కలిసిన సగర, వంశరాజుల సంఘం నాయకులు

తెలంగాణ సగర, వంశరాజుల సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గురువారం ఆమె నివాసంలో వేర్వేరుగా కలిశారు. డెడికేటెడ్ కమిషన్‌కు బీసీ కుల గణన నివేదిక సమర్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఆరోగ్య భద్రత కల్పించడం, బీసీ -డీలో ఉన్న తమ సగర కులాన్ని బీసీ-ఏలో చేర్చడం లాంటి అంశాలను అసెంబ్లీ, కౌన్సిల్‌ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు. సంచారజాతులుగా ఉన్న తాము ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య రంగాల్లో వెనుకబడి ఉన్నామని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వంశరాజుల సంఘం నాయకులు కోరారు. కవితను కలిసిన వారిలో రెండు కుల సంఘాల ముఖ్య నాయకులు బొల్ల శివశంకర్, మురళీకృష్ణ చిందం పాండు, నిమ్మల వీరన్న, విజయేంద్ర సాగర్, ఎస్‌పీ శ్రీను సాగర్, బోశెట్టి భాస్కర్ సాగర్, శ్రీధర్ సాగర్ , గోపి సాగర్, చెన్నయ్య సాగర్, సిద్ది రాములు సాగర్ తదితరులు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News