మళ్లీ రాజుకున్న ప్రత్యేక విదర్భ డిమాండ్.. సీఎం సభలో నినాదాలు చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్టు

విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే తమ ప్రాంత అభివృద్ధి సాధ్యమని ఆ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు.

Advertisement
Update:2023-02-04 08:11 IST

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కొన్ని దశాబ్దాలుగా ఉద్యమం సాగుతోంది. నాగ్ పూర్ కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో కలిపి తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అయితే గ‌త కొన్నేళ్లుగా ప్రత్యేక విదర్భ డిమాండ్ ఊసే లేదు. అయితే ఇప్పుడు మరోసారి విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ మళ్లీ పురుడోసుకుంది.

తాజాగా నాగ్ పూర్ పరిధిలోని వార్దా పట్టణంలో ముఖ్యమంత్రి షిండే పాల్గొన్న కార్యక్రమంలో ఆందోళనకారులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రత్యేక విదర్భ ప్రకటించాలని నినాదాలు చేశారు. ఆందోళనకారుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే తమ ప్రాంత అభివృద్ధి సాధ్యమని ఆ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన సమయంలో మహారాష్ట్రలో కూడా తమకు ప్రత్యేక విదర్భ రాష్ట్రం ప్రకటించాలని ఆ ప్రాంతంలో ఉద్య‌మం తీవ్ర‌త‌రం చేశారు.

2016 లో కూడా ఇదే డిమాండ్ తో ఉద్యమం తీవ్రంగా జరిగింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు జరిపారు. ఎంతో మంది అరెస్టు కూడా అయ్యారు. ముఖ్యంగా యువకులు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు.

అయితే కొంతకాలంగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ స్తబ్దుగా ఉంది. ఇప్పుడు మరోసారి ఆ డిమాండ్ రాజుకుంది. శుక్రవారం వార్దాలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి షిండే పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతున్న సమయంలో కొందరు ఆందోళనకారులు విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని నినాదాలు చేశారు.

ఇలా నినాదాలు చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి షిండే తన ప్రసంగాన్ని కొనసాగించారు. తాజా పరిస్థితులను పరిశీలిస్తే విదర్భ ప్రాంతంలో మరోసారి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News