ఖర్గే, రాహుల్ బాటలోనే సోనియా.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తప్పుతాయని ధీమా
ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ లెక్కలు ఎలా ఉన్నా గెలిచేది ఇండియా కూటమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమాగా చెబుతున్నారు. శనివారం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడగానే రాహుల్ గాంధీ కూడా ఇలాగే స్పందించారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఘంటాపథంగా చెబుతున్నాయి. మోడీ ఆశించినట్లుగా ఎన్డీయేకి 400 సీట్లు రాకపోయినా 350 సీట్లు పక్కా అన్నది అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఇండియా కూటమి 150కి మించి సీట్లు సాధించలేకపోవచ్చనీ అవి లెక్కలేస్తున్నాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలెవరూ దీన్ని నమ్మట్లేదు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తారుమారవుతాయని, గెలిచేది ఇండియా కూటమేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ మాటలంటున్న జాబితాలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా చేరడం విశేషం.
4వ తేదీ వరకు ఆగండన్న సోనియా
`ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంచనాలన్నీ తప్పవుతాయని భావిస్తున్నాం. ఎన్నికల ఫలితాలపై మేం ఆశాభావంతో ఉన్నాం.. జూన్ 4 వరకు ఆగండి.. ఆ రోజు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తప్పుతాయని భావిస్తున్నా`మని తాజాగా సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.
మొన్న ఖర్గే.. నిన్న రాహుల్.. నేడు సోనియా
ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ లెక్కలు ఎలా ఉన్నా గెలిచేది ఇండియా కూటమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమాగా చెబుతున్నారు. శనివారం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడగానే రాహుల్ గాంధీ కూడా ఇలాగే స్పందించారు. ఇండియా కూటమి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మోడీ తెచ్చిన తప్పుడు లెక్కలని ఎగ్జిట్ పోల్స్‌ను ఎద్దేవా చేశారు. తమ కూటమికి 295 సీట్లు వస్తాయని ఆయన ధీమాగా చెప్పారు.