మేము సైతం అంటున్న సోనియా, ప్రియాంక.. భారత్ జోడోకు రెడీ..
ఈనెల 6 నుంచి సోనియా గాంధీ జోడో యాత్రలో పాల్గొంటారని తెలుస్తోంది, ఆ తర్వాతి రోజు ప్రియాంక కూడా వీరితో కలసి నడుస్తారు.
రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర ఆశా జనకంగా ముందుకు సాగుతోంది. దక్షిణాదిలో రాహుల్ యాత్రకు భారీ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఉత్తరాదిలో మరింత జోరుగా యాత్ర కొనసాగుతుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు భారత్ జోడో యాత్రకు అదనపు బలంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాహుల్ తో కలసి నడవబోతున్నారు. ఈనెల 6 నుంచి సోనియా గాంధీ జోడో యాత్రలో పాల్గొంటారని తెలుస్తోంది, ఆ తర్వాతి రోజు ప్రియాంక కూడా వీరితో కలసి నడుస్తారు.
భారత్ జోడో యాత్ర ప్రారంభ సమయంలో సోనియా గాంధీ వైద్యంకోసం విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్నారని, కొడుకుతో కలసి యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. కర్నాటకలోని కూర్గ్ కు చేరుకుని అక్కడ రెండు రోజులు బస చేస్తారు సోనియా. ఆ తర్వాత మాండ్య జిల్లాలో జరిగే యాత్రలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత ప్రియాంక కూడా యాత్రలో పాల్గొంటారు.
సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలైంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 3,750 కిలోమీటర్లు యాత్ర సాగేలా షెడ్యూల్ రూపొందించారు. 5 నెలల పాటు సాగే ఈ యాత్రలో ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కవర్ చేశారు. ప్రస్తుతం కర్నాటకలో ఉన్నారు. తర్వాత తెలంగాణలో అడుగు పెడతారు. తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాహుల్ యాత్ర ధూమ్ ధామ్ గా నిర్వహించాలనుకుంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. యాత్రలో సోనియా, ప్రియాంక కూడా కలసి నడిస్తే.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.