నక్క దాడిలో ఆరుగురికి గాయాలు.. ప్రాణాలకు తెగించి తమ్ముడిని రక్షించుకున్న అక్క
ఆ నక్క వెళ్తూ వెళ్తూ పొలం వద్ద పనిచేస్తున్న మాయాదేవి అనే మహిళపై దాడి చేసింది. ఆమె పెట్టిన కేకలు విన్న చుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకొని నక్కను వెంబడించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో గ్రామస్తులపై నక్క జరిపిన దాడిలో మొత్తం ఆరుగురు గాయపడ్డారు. ఐదేళ్ల బాలుడిపై నక్క దాడి చేయగా.. నక్కతో ధైర్యంగా పోరాడిన బాలుడి అక్క చిన్నారిని దాని బారి నుంచి కాపాడుకుంది. రహీమాబాద్ ప్రాంతం మావైకల గ్రామానికి చెందిన ప్రదీప్ కూతురు నేహా(11), కుమారుడు హర్ష్ (5) ఆడుకోవడం కోసం మంగళవారం ఊరి బయటకు వెళ్లారు. వారు ఆడుకుంటున్న సమయంలో అక్కడికి ఒక నక్క వచ్చింది. బాలుడిపై దాడికి దిగింది. అతడి చేయి, కాలుపై గాయాలు చేసింది.
ఇది చూసిన అక్క తన తమ్ముడి ప్రాణాలు కాపాడుకునేందుకు నక్కతో పోరాటానికి దిగింది. గాయపరుస్తున్నా లెక్కచేయకుండా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. పిల్లలపై నక్క దాడి చేయడం గమనించిన గ్రామానికి చెందిన చాంద్ హసన్ కర్ర తీసుకొని నక్కపై దాడికి దిగాడు. నక్క అతడి చేయి, కాళ్లు కొరికినా..పట్టు వదలకుండా అతడు దాడి కొనసాగించడంతో అది అక్కడి నుంచి పారిపోయింది.
ఆ నక్క వెళ్తూ వెళ్తూ పొలం వద్ద పనిచేస్తున్న మాయాదేవి అనే మహిళపై దాడి చేసింది. ఆమె పెట్టిన కేకలు విన్న చుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకొని నక్కను వెంబడించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన నక్క ఓ తోట వద్ద కాపలాగా ఉన్న అశోక్(27) అనే యువకుడిపై దాడి చేసి అతడి చేతిని కొరికింది. అనంతరం పొలం వద్ద నుంచి సైకిల్ పై ఇంటికి తిరిగి వస్తున్న పురాయ్ అనే వ్యక్తిపై కూడా నక్క దాడి చేసింది.
ఆలోగా గ్రామస్తులందరూ అక్కడికి చేరుకోవడంతో వారిని చూసి నక్క పారిపోయింది. నక్క దాడిలో మొత్తం ఆరుగురు గ్రామస్తులు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం మలీహబాద్ ఆసుపత్రికి తరలించారు. కాగా, చిన్నారి హర్ష్ పై నక్క దాడి చేస్తుండగా.. ప్రాణానికి తెగించి తన తమ్ముడిని కాపాడిన నేహాను గ్రామస్తులు అభినందించారు.