అద్నాన్ స‌మీ.. 230 కేజీల నుంచి 75 కేజీల‌కు.. - 16 నెల‌ల్లో స‌హ‌జ ప‌ద్ధ‌తిలో బ‌రువు త‌గ్గిన సింగ‌ర్‌

చిన్నత‌నం నుంచీ తాను బొద్దుగానే ఉండేవాడిన‌ని అద్నాన్ వెల్ల‌డించారు. ఆపై ఫిట్‌నెస్ విష‌యంలో ఎలాంటి శ్ర‌ద్ధా తీసుకోక‌పోవ‌డంతో భారీగా బ‌రువు పెరిగాన‌ని చెప్పారు.

Advertisement
Update:2023-03-05 11:18 IST

అద్నాన్ స‌మీ.. ఈ పేరు విన‌గానే భారీ ఆకారంతో విప‌రీత‌మైన బ‌రువుతో క‌నిపించే రూప‌మే అంద‌రికీ క‌ళ్ల‌లో మెదులుతుంది. ఇక‌పై ఆయ‌న్ని గుర్తు ప‌ట్టాలంటే అభిమానుల‌కు ఇబ్బందే.. ఎందుకంటే.. అంత‌టి భారీ కాయాన్ని స‌హ‌జ ప‌ద్ధ‌తుల్లో డైట్ ప్లాన్‌, శారీర‌క శ్ర‌మ‌తో భారీగా త‌గ్గించేశాడు ఈ సింగ‌ర్‌. అదీ ఎంతంటే 230 కేజీల నుంచి 75 కేజీల‌కు. అది కూడా 16 నెల‌ల వ్య‌వ‌ధిలో కావ‌డం విశేషం. ఆ వివ‌రాలను ఇటీవ‌లే ఆయ‌న మీడియాకు వెల్ల‌డించారు.

చిన్న‌త‌నం నుంచీ బొద్దుగానే..

చిన్నత‌నం నుంచీ తాను బొద్దుగానే ఉండేవాడిన‌ని అద్నాన్ వెల్ల‌డించారు. ఆపై ఫిట్‌నెస్ విష‌యంలో ఎలాంటి శ్ర‌ద్ధా తీసుకోక‌పోవ‌డంతో భారీగా బ‌రువు పెరిగాన‌ని చెప్పారు. దీనివ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు కూడా ఎదుర్కొన్నాన‌ని ఆయ‌న వివ‌రించారు. నిద్ర‌పోతే గుర‌క వ‌చ్చేద‌ని, దానివ‌ల్ల శ‌రీరం అల‌సిపోయి నీర‌సం వ‌చ్చి మేలుకునేవాడిన‌ని చెప్పారు. దాంతో చాలాకాలం పాటు కూర్చునే నిద్ర‌పోయేవాడిన‌ని, కారు కూడా ఎక్క‌లేని ప‌రిస్థితి వ‌చ్చింద‌ని వివ‌రించారు.

భార్యా పిల్ల‌లూ దూర‌మ‌య్యారు...

2005 నాటికి 200 కేజీల బ‌రువు ఉండేవాడిన‌ని అద్నాన్ వెల్ల‌డించారు. బ‌రువు ప్ర‌భావం మోకాళ్ల‌పై ప‌డి విప‌రీత‌మైన నొప్పి వ‌చ్చేద‌ని, దీంతో మోకాళ్ల ఆప‌రేష‌న్ చేశార‌ని, దానివ‌ల్ల ఏడాదిపాటు మంచానికే ప‌రిమిత‌మ‌య్యాన‌ని వివ‌రించారు. అప్ప‌ట్లో త‌ప్ప‌నిస‌రై తీసుకున్న ఆ విశ్రాంతి, దానికితోడు తీసుకున్న ఆహారం వ‌ల్ల మ‌రో 30 కేజీలు పెరిగి 230కి చేరాన‌ని తెలిపారు. దానివ‌ల్ల త‌న భార్య‌, పిల్ల‌లు కూడా దూర‌మ‌య్యార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆరు నెల‌ల్లో చ‌నిపోతాన‌ని డాక్ట‌ర్లు చెప్పేశారు..

అమెరికాలో అమ్మానాన్న‌ల వ‌ద్ద ఉండే స‌మ‌యంలో ఓసారి బాగా నీర‌సంగా ఉంద‌ని డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళితే.. మీ అబ్బాయి ఆరు నెల‌ల్లో చనిపోతాడ‌ని డాక్ట‌ర్లు నాన్న‌కు నేరుగా చెప్పేశార‌ని అద్నాన్‌ వివ‌రించారు. మీ క‌ళ్ల ముందే గుండెపోటు వ‌చ్చి పోయినా పోవ‌చ్చ‌ని చెప్ప‌డంతో త‌న తండ్రి తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యార‌ని చెప్పారు. ఏ తండ్ర‌యినా కొడుకు చేతుల‌మీదుగా అంతిమ సంస్కారాలు చేయించుకోవాల‌నుకుంటాడు.. కానీ.. త‌న కొడుక్కి చేయాల‌నుకోడు క‌ద‌రా.. అంటూ త‌న‌ను ప‌ట్టుకుని ఆయ‌న బోరున ఏడ్చేశారని వివ‌రించారు.

నాన్న అడిగాడ‌ని..

ఎప్పుడూ త‌న కోసం ఏదీ అడ‌గ‌ని నా తండ్రి.. ప్రాణాలు తీసే బ‌రువును త‌గ్గించుకోరా.. అని మొద‌టిసారి అడిగారని.. ఆయ‌న కోస‌మైనా బ‌రువు త‌గ్గాల‌నిపించింద‌ని అద్నాన్ తెలిపారు. కృత్రిమ ప‌ద్ధ‌తుల్లో బ‌రువు త‌గ్గే అవ‌కాశాలున్నా.. స‌హ‌జంగానే త‌గ్గాల‌ని నిశ్చ‌యించుకున్నాన‌ని చెప్పారు. అందుకే డాక్ట‌ర్ల సూచ‌న‌ల‌తో డైట్ ప్లాన్ తీసుకుని.. కొద్దికొద్దిగా వ్యాయామం ప్రారంభించి.. దానిని క్ర‌మేపీ పెంచుకుంటూ వెళ్లాన‌ని వివ‌రించారు. త‌ద్వారా 130 కేజీలు త‌గ్గి 100 కేజీల‌కు చేరాన‌ని.. అలా త‌గ్గాక అద్దంలో త‌న‌ను తాను చూసుకుని మురిసిపోయాన‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల మ‌రో 25 కేజీలు త‌గ్గి 75 కేజీల‌కు చేరాన‌ని అద్నాన్ వివ‌రించారు.

డైట్ ప్లాన్ ఫాలో అయిందిలా..

బ్రెడ్‌, అన్నం, రోటీ, ఉప్పు, నూనె, చ‌క్కెర‌, స్వీట్లు, కేకులు, ఐస్‌క్రీములు, మ‌ద్యం, క్యాన్డ్ ఫుడ్ వంటి వాటిని దూరం పెట్టాన‌ని అద్నాన్ వివ‌రించారు. అది చాలా క‌ష్టంగా అనిపించినా.. త‌ప్ప‌నిస‌రిగా పాటించాన‌ని తెలిపారు. తాను తీసుకున్న ఆహారంలో ప్ర‌ధానంగా.. ఉద‌యం పూట పండ్ల ముక్క‌లు, వెన్న లేకుండా పాప్‌కార్న్‌, చ‌క్కెర లేని పానీయాలు తీసుకున్నాన‌ని చెప్పారు. మ‌ధ్యాహ్నం భోజ‌నంలో కూర‌గాయ‌ల స‌లాడ్లు, తందూరీ ఫిష్ తినేవాడిన‌ని వివ‌రించారు. ఇక రాత్రి వేళ‌.. ఉడికించిన ప‌ప్పు లేదా నూనె లేకుండా కాల్చిన చికెన్ తినేవాడిన‌ని తెలిపారు. ఇలా దాదాపు మూడు నెల‌ల పాటు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో డైటింగ్ చేస్తూ.. నిపుణుల సూచ‌న‌ల‌తో రోజుకో పావుగంట న‌డుస్తూ.. క్ర‌మంగా ఆ స‌మ‌యాన్ని పెంచుతూ వ‌చ్చాన‌ని చెప్పారు. క్ర‌మంగా రోజుకు నాలుగు గంట‌ల పాటు న‌డ‌వ‌డం అల‌వాటు చేసుకున్నాన‌ని అద్నాన్ వెల్ల‌డించారు. ఆ త‌రువాత ట్రెడ్ మిల్‌పై రోజుకు గంట‌సేపు ప‌రిగెత్త‌డం ప్రారంభించాన‌ని వివ‌రించారు. ఆ త‌రువాత మ‌రో గంట వెయిట్ ట్రైనింగ్‌, మ‌రో గంట కార్డియో వ్యాయామాలు చేసేవాడిన‌ని చెప్పారు. అలా చేసి నెల‌లో ప‌ది కేజీలు త‌గ్గ‌డంతో త‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కం ఏర్ప‌డింద‌న్నారు. ఇప్పుడు పూర్తిగా బ‌రువు త‌గ్గిన త‌రువాత త‌న‌ను చూసుకుంటే త‌న‌కే ఎంతో ఆనందంగా ఆయ‌న వివ‌రించారు.

Tags:    
Advertisement

Similar News