పవార్ రాజీనామాను తిరస్కరించిన ఎన్సీపీ ప్యానెల్
పార్టీ కార్యకర్తలు, నాయకుల డిమాండ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని శుక్రవారం సమావేశం నిర్వహించి కమిటీ ఏకగ్రీవంగా ఆయన రాజీనామాను తిరస్కరించాలనే ప్రతిపాదనను ఆమోదించిందని తెలిపారు.
ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు ఈనెల 2వ తేదీన శరద్ పవార్ బాంబు పేల్చిన విషయం తెలిసిందే. పవార్ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ భవిష్యత్తు కోసం, కొత్త నాయకత్వాన్ని సృష్టించేందుకే పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు రాజీనామా సందర్భంగా పవార్ తెలిపారు.
అయితే ఈ అంశంపై చర్చించేందుకు శుక్రవారం ముంబైలో సమావేశమైన శరద్ పవార్ నేతృత్వంలోని ప్యానెల్ ఆయన రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఎన్సీపీ కార్యకర్తల మనోభావాలను తాము విస్మరించలేమని ఈ సందర్భంగా ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు.
పవార్ సాహెబ్ తమకు తెలియజేయకుండా నిర్ణయం తీసుకున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల డిమాండ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని శుక్రవారం సమావేశం నిర్వహించి కమిటీ ఏకగ్రీవంగా ఆయన రాజీనామాను తిరస్కరించాలనే ప్రతిపాదనను ఆమోదించిందని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగవలసిందిగా పవార్‌ను తాము అభ్యర్థిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశం సందర్భంగా మహారాష్ట్రలోని ఎన్సీపీ కార్యకర్తలు దక్షిణ ముంబైలోని పార్టీ కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు.