వారికి ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి..

తమ పార్టీలోకి వచ్చే వారికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని శరద్‌ పవార్‌ ఈ సందర్భంగా సంకేతాలు ఇచ్చారు. అయితే, చేర్చుకునే ముందు తన సహచరులతో సంప్రదిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Update: 2024-06-26 02:11 GMT

అజిత్‌ పవార్‌ వర్గం ఎమ్మెల్యేలకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నేత శరద్‌ పవార్‌ తెలిపారు. అజిత్‌ పవార్‌ తిరుగుబాటుతో శరద్‌ పవార్‌ ఆధ్వర్యంలోని ఎన్సీపీ రెండుగా చీలిన సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్రలో ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎన్సీపీకి అనుకూలంగా వచ్చాయి. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ 10 స్థానాల్లో పోటీ చేయగా.. 8 చోట్ల విజయం సాధించింది. అజిత్‌ వర్గం మాత్రం నాలుగు చోట్ల పోటీ చేసి ఒకే స్థానానికి పరిమితమైంది.

మరోపక్క కొద్ది నెలల్లోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన 18 నుంచి 19 మంది ఎమ్మెల్యేలు తిరిగి శరద్‌ పవార్‌ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శరద్‌ పవార్‌ పైవిధంగా స్పందించారు. కేంద్ర మాజీ మంత్రి సూర్యకాంత్‌ పాటిల్‌ తిరిగి పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్‌ పవార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ పార్టీలోకి వచ్చే వారికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని శరద్‌ పవార్‌ ఈ సందర్భంగా సంకేతాలు ఇచ్చారు. అయితే, చేర్చుకునే ముందు తన సహచరులతో సంప్రదిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆ ఎమ్మెల్యేలు తిరిగి చేరడంలో ఎటువంటి ఇబ్బందీ లేదని, ఎప్పుడు చేరినా కార్యకర్తల్లో మనోధైర్యం పెంచుతుందని ఆయన చెప్పారు. కానీ, పార్టీ కార్యకర్తల భావోద్వేగాలను గౌరవించాల్సిన అవసరం ఉన్నందున.. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని మాత్రం తిరిగి తీసుకోబోమని స్పష్టం చేశారు. దీనిపై పార్టీ సహచరులను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News