రాహుల్ గాంధీకి చలివేసిందా ? ఆయన వేసుకున్నది జాకెటా ? రెయిన్ కోటా? ఇదేనా జరగాల్సిన చర్చ?

రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా వర్షం పడిందని అందువల్ల ఆయన రెయిన్ కోట్ వేసుకున్నారని వర్షం తగ్గగానే దాన్ని తీసేశారని, అది జాకెట్ కాదని చెప్పిన కాంగ్రెస్ ట్విట్టర్ లో దానికి స‍ంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.

Advertisement
Update:2023-01-20 17:51 IST

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తెల్లటి టీ షర్ట్ వేసుకొని సాగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వణికించే చలిలో కూడా ఆయన అదే టీ షర్ట్ తో పాద యాత్ర చేయడం చర్చనీయాంశ‌మైంది. ఈ అంశంపై కూడా బీజేపీ సోషల్ మీడియాలో దాడి చేసింది. రాహుల్ టీ షర్ట్ లోపల థర్మల్స్ వేసుకున్నాడని, అందుకే చలి పెట్టడం లేదని ఆరోపణలు చేశారు. అయినా ఆ ఆరోపణలను పట్టించుకోని రాహుల్ గాంధీ అదే టీ షర్ట్ తో తన యాత్ర కొనసాగిస్తున్నారు.

కన్యా కుమారిలో ప్రారంభమైన యాత్ర ఈ రోజు జమ్ముకశ్మీర్ లో సాగుతోంది. అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ టీ షర్ట్ మీద మరో నల్లటి వస్త్రం ధరించారు. అది జాకెట్ అని బీజేపీ సోషల్ మీడియా అటాక్ మొదలుపెట్టింది. రాహుల్ గాంధీకి చలి మొదలయ్యిందా అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ ట్విట్టర్ లో కామెంట్లు మొదలు పెట్టారు. జాతీయ మీడియా కూడా దీనిపై కథనాలను ఒండి వార్చింది. ఉదయం నుంచి ఇదే విషయంపై ఆయన వ్యతిరేకులు వ్యంగ్యాంస్త్రాలు సంధిస్తూ ఉండగా మధ్యాహ్నానికి కాంగ్రెస్ స్పందించింది.

రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా వర్షం పడిందని అందువల్ల ఆయన రెయిన్ కోట్ వేసుకున్నారని వర్షం తగ్గగానే దాన్ని తీసేశారని, అది జాకెట్ కాదని చెప్పిన కాంగ్రెస్ ట్విట్టర్ లో దానికి స‍ంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.

అయితే రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్ర, ఆ యాత్రలో ఆయన ప్రచారం చేస్తున్న భావజాలం, అందులోని మంచి, చెడుల‌ మీద కాకుండా ఆయన వేసుకున్న టి షర్టులు, జాకెట్ లు, రెయిన్ కోట్ ల మీద చర్చ జరగడం మన భావజాల దివాళాకోరు తనానికి నిదర్శనం కాదా ?


Tags:    
Advertisement

Similar News