నేరస్థుడు ఇంటివాడైనా..పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు దాచొద్దు : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్

జ్యూడీషియరీ సిస్టమ్ కొన్ని సార్లు బాధితుల మానసిక క్షోభను పెంచేలా వ్యవహరించడం దురదృష్టకరమని, దీనిని నిరోధించేందుకు న్యాయవ్యవస్థ, పోలీసులు చేతులు కలపాలని అన్నారు.

Advertisement
Update:2022-12-11 16:58 IST

పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు ఒక సమస్యగా మిగిలిపోతున్నాయని, అందుకు చాలా కారణాలు ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై. చంద్రచూడ్ అన్నారు. మన దేశంలో ఉన్న నిశ్శబ్ద సంస్కృతి కారణంగా పిల్లలపై లైంగిక వేధింపులు జరిగినా చాలా మంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నేరస్థుడు ఇంటి సభ్యుడు అయినా.. జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేలా కుటుంబాలను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వాలదే అని సీజేఐ అన్నారు. ఫోక్సో చట్టంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ.. అనేక విషయాలను వివరించారు.

జ్యూడీషియరీ సిస్టమ్ కొన్ని సార్లు బాధితుల మానసిక క్షోభను పెంచేలా వ్యవహరించడం దురదృష్టకరమని, దీనిని నిరోధించేందుకు న్యాయవ్యవస్థ, పోలీసులు చేతులు కలపాలని అన్నారు. చిన్నారులపై జరిగే లైంగిక వేధింపుల వల్ల వచ్చే దీర్ఘకాలిక చిక్కులు, వేధింపుల నివారణ, సకాలంలో గుర్తించడం, చట్టం ద్వారా ఎదుర్కునేందుకు అవగాహన కల్పించడం చాలా ముఖమని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.

పిల్లలకు సురక్షితమైన స్పర్శ, అసురక్షిత స్పర్శ మధ్య తేడాను తప్పకుండా వివరించాలని ఆయన కోరారు. గతంలో వీటిని మంచి స్పర్శ, చెడు స్పర్శగా సూచించినప్పటికీ.. బాలల హక్కుల కార్యకర్తల వాటిని సురక్షిత, అసురక్షిత పదాలను వాడాలని తల్లిదండ్రులను కోరారు. మంచి, చెడు అనే పదాలు నైతిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది తమకు జరిగిన ఘటన గురించి ఫిర్యాదు చేయకుండా నిరోధించవచ్చు. కాబట్టి సురక్షిత, అసురక్షిత అనే పదాలను వాడాలని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.

పోక్సో చట్టం ప్రకారం మైనర్‌లలో జరిగే లైంగిక చర్యలు వాస్తవంగా సమ్మతి ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా.. 18 ఏళ్ల లోపు వారిపై జరిగే అన్ని లైంగిక చర్యలను నేరంగా పరిగణిస్తుంది. ఎందుకంటే 18 ఏళ్లలోపు వారిలో సమ్మతి లేదని చట్టం ఊహిస్తుంది. మైనర్లపై జరిగే ఇలాంటి దాడుల కేసుల విచారణ సందర్భంగా.. న్యాయమూర్తలకు కష్టమైన సవాళ్లు ఎదురవుతుంటాయి. ప్రతీ రోజు ఇలాంటి కేసులు ఎక్కువగా చూస్తూనే ఉన్నామని చంద్రచూడ్ అన్నారు. 

Tags:    
Advertisement

Similar News