ఆలయంపై కూలిన చెట్టు.. ఏడుగురు మృత్యువాత - మరో 23 మందికి గాయాలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు.
ఆలయంలో జరుగుతున్న వేడుకలు విషాదంగా మారాయి. వందేళ్ల నాటి చెట్టు అకస్మాత్తుగా ఆలయంపై కుప్పకూలడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని అకోలా జిల్లా బాబూజీ మహరాజ్ ఆలయంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో బాబూజీ మహరాజ్ ఆలయంలో మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అకోలా జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులకు వందేళ్ల నాటి భారీ వేప చెట్టు దెబ్బతింది. ఆదివారం రాత్రి ఆలయంలో పూజలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా చెట్టు కూలి ఆలయ ప్రాంగణంలోని షెడ్డుపై పడింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని.. రెస్క్యూ టీమ్‌తో వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బుల్‌డోజర్ సాయంతో చెట్టును తొలగించారు. ఆ షెడ్డులో చిక్కుకుపోయిన ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు.