స్త్రీపై దుష్ప్రచారం కూడా క్రూరత్వమే.. విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

మహిళ నడవడికపై అభాండాలు వేయడం కన్నా ఎక్కువ క్రూరత్వం మరొకటి లేదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. విడాకులు మంజూరు చేయడానికి ఇది సరియైన కారణమేనని వివరించింది.

Advertisement
Update:2023-09-07 12:17 IST

భార్యాభర్తల విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మానసిక క్రూరత్వం అనే పదం పరిధి చాలా విశాలమైనదని, అది ఆర్థిక అస్థిరత వల్ల కలుగుతుందని పేర్కొంది. ఏదైనా వ్యాపారం లేదా వృత్తిలో భర్త స్థానం కోల్పోవడం మానసిక క్షోభకు దారితీస్తుందని పేర్కొంది.

కేసు వివరాల్లోకి వెళితే..

ఢిల్లీకి చెందిన ఓ మహిళ విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన భర్త డిగ్రీ చదివి, ఉద్యోగం చేస్తున్నానని చెప్పి తనను పెళ్లి చేసుకున్నాడని, అవన్నీ అబద్ధాలేనని పెళ్లయ్యాక తెలిసిందని చెప్పింది. భర్తకు స్థిరమైన ఉద్యోగం లేదని, పెళ్లికి ముందునుంచే తాను ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని వివరించింది. భర్తకు ఉద్యోగం లేకున్నా సర్దుకుపోయానని, కానీ ఉద్యోగానికి వెళ్లే తనకు ఇతరులతో అక్రమ సంబంధం అంటగడుతూ వేధిస్తుండడం భరించలేకపోయానని తెలిపింది. దీంతో ఆమె 1989లో వివాహం కాగా 1996 నుంచి అంటే సుమారు 27 ఏళ్లుగా విడిగా ఉంటున్నానని, మానసికంగా వేధిస్తున్న భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరింది. అయితే ఈ కారణంతో విడాకులు ఇవ్వలేమన్న ఫ్యామిలీ కోర్టు కేసును పక్కన పెట్టేసింది.

కేసును అప్పీలుకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు మానసిక క్రూరత్వాన్ని ఏ ఒక్క పారామీటర్ ఆధారంగా నిర్వచించలేని చెప్పింది. దీన్ని నిర్ధారించడానికి భార్యాభర్తల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. మహిళ నడవడికపై అభాండాలు వేయడం కన్నా ఎక్కువ క్రూరత్వం మరొకటి లేదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. తప్పుడు ఆరోపణలు మానసిక క్రూరత్వమేనని స్పష్టం చేసింది. విడాకులు మంజూరు చేయడానికి ఇది సరియైన కారణమేనని వివరించింది. ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి వేధింపులకు దారితీస్తుందని పేర్కొంది. ఆమె భర్త చేష్టలు మానసిక వేధింపుల కిందికే వస్తాయని పేర్కొంటూ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.

Tags:    
Advertisement

Similar News