బీజేపీ ఈ సారి 50 ఎంపీ సీట్లు కోల్పోతుంది - కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కామెంట్
పుల్వామా, బాలాకోట్ దాడులు గత ఎన్నికల్లో చివరి నిమిషంలో బీజేపీకి బాగా కలిసొచ్చిన అంశాలని ఆయన చెప్పారు. కానీ ఈసారి మాత్రం అది పునరావృతం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు కోల్పోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ స్పష్టం చేశారు. శుక్రవారం తిరువనంతపురంలో నిర్వహించిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి 2019 తరహా మ్యాజిక్ బీజేపీకి ఏమాత్రం పనిచేయదని ఆయన తెలిపారు. కేంద్రంలో అధికారం కోల్పోయే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని ఆయన చెప్పారు.
2019లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. 2019 ఏడాదిని పరిశీలిస్తే.. హర్యానా, గుజరాత్, రాజస్తాన్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో బీజేపీ సాధించిన సీట్లను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని శశిథరూర్ తెలిపారు. పుల్వామా దాడులు, బాలాకోట్ దాడులు గత ఎన్నికల్లో చివరి నిమిషంలో బీజేపీకి బాగా కలిసొచ్చిన అంశాలని ఆయన చెప్పారు. కానీ ఈసారి మాత్రం అది పునరావృతం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను చెప్పినదానిని బట్టి 50 స్థానాలను బీజేపీ కోల్పోతే.. మిగతా పార్టీలన్నీ మెజారిటీ స్థానాలను దక్కించుకున్నట్టు అవుతుందని శశిథరూర్ చెప్పారు. అలాంటి సందర్భంలో అవతలి పార్టీ నుంచి ఎంపీలను లాక్కుని అధికారాన్ని ఏర్పాటు చేయడం లాంటి ప్రయత్నాలను బీజేపీ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదని ఆయన తెలిపారు.