విద్యార్థులను బలిపశువులుగా చేశారు: జామియా మిలియా యూనివర్సిటీ అల్లర్ల కేసును కొట్టివేసిన కోర్టు
లైవ్ లా ప్రకారం, సాకేత్ జిల్లా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి అరుల్ వర్మ తన తీర్పులో, ప్రాసిక్యూషన్ అసలు నేరస్తులను పట్టుకోలేకపోయిందని, అయితే నిందితులను బలిపశువులుగా మార్చిందని అన్నారు.
డిసెంబరు 2019లో ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ సమీపంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించి విద్యార్థి నాయకులు షర్జీల్ ఇమామ్, సఫూరా జర్గర్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా తో సహా మరో ఎనిమిది మందిని ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 4, శనివారం విడుదల చేసింది.
లైవ్ లా ప్రకారం, సాకేత్ జిల్లా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి అరుల్ వర్మ తన తీర్పులో, ప్రాసిక్యూషన్ అసలు నేరస్తులను పట్టుకోలేకపోయిందని, అయితే నిందితులను బలిపశువులుగా మార్చిందని అన్నారు.
ప్రాసిక్యూషన్ అసమర్థ ఛార్జిషీట్లను దాఖలు చేసిందని, ఇందులో పోలీసులు ఏకపక్షంగా నిరసనలో ఉన్న కొంతమంది వ్యక్తులను నిందితులుగా, మరికొందరిని పోలీసు సాక్షులుగా చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది న్యాయ సూత్రాలకు హానికరం అని కోర్టు పేర్కొంది.
" వాక్ స్వాతంత్య్రం అనే ప్రాథమిక హక్కుకు పొడిగింపే అసమ్మతి" అని న్యాయమూర్తి వర్మ అన్నారు.
"అసమ్మతి అనేది భారత రాజ్యాంగంలోని 19వ అధికరణలో ఉన్న అమూల్యమైన వాక్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కు కు పొడిగింపు తప్ప మరొకటి కాదు. కాబట్టి వారి హక్కును మేము సమర్థిస్తాము ”అని న్యాయమూర్తి అన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
భిన్నాభిప్రాయాలకు సంబంధించిన స్వేచ్ఛను కాపాడవలసిన అవసరాన్ని నొక్కిచెప్పిన న్యాయమూర్తి, “మన మనస్సాక్షికి ఏదైనా వ్యతిరేకంగా ఉన్నప్పుడు , మేము దానిని పాటించటానికి నిరాకరిస్తాము. మన మనస్సాక్షికి విరుద్ధమైన దేనికైనా అవిధేయత చూపడం మన విధి.” అన్నారాయన
ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ అసమ్మతిని ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్‌గా అభివర్ణించారు అని న్యాయమూర్తి వర్మ అన్నారు "ప్రశ్నించే, అసమ్మతి హక్కులను నాశనం చేయడం అనేది రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక - అన్ని ఎదుగుదలలను నాశనం చేస్తుంది. ఈ కోణంలో, అసమ్మతి ప్రజాస్వామ్యం యొక్క సేఫ్టీ వాల్వ్, ”అని న్యాయమూర్తి వర్మ CJIని ఉటంకించారు.
న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ పై విమర్శలు చేస్తూ, ఈ అంశంపై దాఖలు చేసిన అనేక ఛార్జిషీట్‌లను ప్రశ్నించారు. “ప్రస్తుత కేసులో, పోలీసులు ఒక ఛార్జిషీట్‌ను దాఖలు చేయడమే ఎక్కువ. పైగా ఒకటి కాదు మూడు అనుబంధ ఛార్జిషీట్‌లను దాఖలు చేశారు. నిజానికి ఆ చార్జ్ షీట్లలో విషయం ఏమీ లేదు. ఈ ఛార్జిషీట్‌ల సమీకరణ నిలిపివేయాలి, ఇలాంటి చర్య నిందితుల హక్కులను తుంగలో తొక్కేస్తుంది. ”అని ఆయన అన్నారు.
హింసకు పాల్పడిన గుంపులో నిందితులు భాగమని సూచించడానికి ప్రాథమిక సాక్ష్యం లేదని, వారు ఎలాంటి ఆయుధాలను ఉపయోగించడం, లేదా రాళ్లు రువ్వడం చేయలేదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. "కచ్చితంగా ఊహాగానాల ఆధారంగా ప్రాసిక్యూషన్లు ప్రారంభించబడవు. వాటి ఆధారంగా ఛార్జిషీట్లను దాఖలు చేయకూడదు" అని వర్మ పోలీసులకు సూచించారు.
నిందితులను బలిపశువులు చేయడం, వారిపై అభియోగాలను నిరూపించడం కోసం అనవసర ప్రయత్నాలు చేయడం కంటే పోలీసులు విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ ను , దర్యాప్తు కోసం సాంకేతికతను ఉపయోగించాలని కోర్టు పేర్కొంది.
కాగా షర్జిల్ ఇమామ్ ఈ కేసులోనుంచి బైటపడ్డప్పటికీ 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కుట్ర కేసులో నిందితుడిగా ఉన్నందున కస్టడీలోనే ఉంటాడు. యుఎపిఎ సెక్షన్లను ప్రయోగించిన ఈ కేసులో తన్హా, జర్గర్ కూడా నిందితులుగా ఉన్నారు.