ఆఫీస్ కి వస్తే ఉపయోగం ఏంటి..? సత్య నాదెళ్ల ఏం చెబుతున్నారంటే..?

భారత్ లో 80శాతం మంది ఉద్యోగులు ఆఫీస్ కి రావడానికి సరైన కారణం చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారని చెప్పారు సత్య నాదెళ్ల. అయితే వారికి ఆయా కారణాలను వివరించడంలోనే మేనేజర్ల లౌక్యం బయటపడుతుందని చెప్పుకొచ్చారు.

Advertisement
Update:2022-10-21 07:28 IST

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల్ని ఆఫీస్ లకు రప్పించేందుకు కంపెనీలు శత విధాలా ప్రయత్నిస్తున్నాయి. అవసరమైతే కంపెనీ మారిపోతాం కానీ, ఆఫీస్ కి మాత్రం రాలేమంటున్నారు కొంతమంది ఉద్యోగులు. ఇది చిన్నా చితకా కంపెనీలకే కాదు, ఆఫీస్ లో అద్భుతమైన సౌకర్యాలు కల్పించే బడా కంపెనీలకి కూడా ఈ సమస్య ఉంది. అంతెందుకు మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు కూడా ఈ అనుభవం ఎదురైంది. భారత్ లో 80శాతం మంది ఉద్యోగులు ఆఫీస్ కి రావడానికి సరైన కారణం చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారని అంటున్నారాయన. అయితే వారికి ఆయా కారణాలను వివరించడంలోనే మేనేజర్ల లౌక్యం బయటపడుతుందని చెప్పుకొచ్చారు.

ఉపయోగాలున్నాయి..

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగాలుంటాయో, ఆఫీస్ కి వచ్చి పనిచేస్తే కంపెనీకి కూడా కొన్ని ఉపయోగాలుంటాయని చెబుతున్నారు సత్య నాదెళ్ల. ఉద్యోగుల మధ్య సంబంధాలు మెరుగుపడాలన్నా, కొత్త టీమ్ లు ఏర్పాటు చేయాలన్నా సిబ్బంది ఆఫీస్ కి రావడమే ఉత్తమమని చెప్పారు. ఉద్యోగులకు మేనేజర్లు ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్తే ప్రయోజనం ఉంటుందన్నారు సత్య నాదెళ్ల.

పనితీరుకి వంక పెట్టలేం..

ఆఫీస్ లో ఉన్నా, ఇంట్లో ఉన్నా తమ ఉద్యోగులు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చెబుతున్నారు సత్య నాదెళ్ల. వర్క్ ఫ్రమ్ హోమ్ తో దాదాపు అన్ని కంపెనీల్లో ఉత్పాదకత పెరిగిందని గుర్తు చేశారు. ఇంట్లో ఉంటే.. ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదని, దాని ప్రభావం ఉత్పాదకతపై పడుతోందని కొంతమంది మేనేజర్లు చెబుతున్నా, రికార్డులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయని చెప్పారు సత్య నాదెళ్ల. ఆఫీసుకు వచ్చినప్పటి కంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఉద్యోగులు ఎక్కువ పని చేస్తున్నట్లు తేలిందన్నారు. అయితే ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు పెరగాలంటే మాత్రం కనీసం వారంలో మూడు రోజులపాటు ఆఫీస్ కి రావాల్సి ఉంటుందన్నారు. కొత్త టీమ్ లు ఏర్పాటు చేయడానికి ఇది అత్యవసరం అని చెప్పారు. మూన్ లైటింగ్ గురించి మాత్రం ఆయన స్పందించలేదు.

Tags:    
Advertisement

Similar News