అబ్దుల్ కలాంను ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చిన విపక్ష నేత సతీమణి
మహారాష్ట్ర సీనియర్ నేత ఎన్సీపీ నేత జితేందర్ అవధ్ సతీమణి రుతా అవధ్ వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
మహారాష్ట్ర సీనియర్ నేత ఎన్సీపీ (శరద్ పవార్ పార్టీ)కి చెందిన జితేంద్ర అవధ్ సతీమణి ఓ బహిరంగ కార్యక్రమంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమె మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరును కూడా ప్రస్తావించడం తీవ్ర వివాదాస్పదమైంది. సమాజంలో నెలకొన్న పరిస్థితులే ఒసామా బిన్ లాడెన్‌ను ఉగ్రవాదిగా మార్చాయని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. టెర్రరిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం ఇండియా కూటమి నేతలకు అలవాటేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.
జితేందర్ అవధ్ సతీమణి రుతా అవధ్ ఓ బహిరంగ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు ఒసామా బిన్‌లాడెన్ జీవిత చరిత్ర చదవండి. కలాం ఎలా రాష్ట్రపతి అయ్యారో.. లాడెన్ ఉగ్రవాదిగా ఎలా మారాడో అర్థం చేసుకోవడానికి దానిని చదవండి. అతను ఉగ్రవాదిగా ఎందుకు మారాడు? అతను ఆ మార్గాన్ని ఎంచుకోవడానికి సమాజం ఉంచి అతనికి ఎదురైన పరిస్థితులే కారణం అన్నారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన బీజేపీ దివంగత రాష్ట్రపతి జీవిత చరిత్రను.. బిన్ లాడెన్ జీవిత చరిత్రలో ముడిపెడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదులను వెనకేసుకురావడం ఇండియా కూటమి పార్టీలకు ఓ అలవాటుగా మారిందని బీజేపీ నేత షెహనాద్ పూనావాల విమర్శించారు. అయితే ఈ విమర్శలపై స్పందించిన రూతా తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు.