రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తలేడని రేవంత్‌ సోనియమ్మను పొగుడుతున్నడు

మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

Advertisement
Update:2025-01-16 17:19 IST

రాహుల్‌ గాంధీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదనే సీఎం రేవంత్‌ రెడ్డి ఈ రోజు సోనియమ్మను పొగుడుతున్నాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఒకరోజు ఇదే రేవంత్‌ సోనియాగాంధీని బలిదేవత అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలను 13 నెలలుగా అబద్ధాలతో మోసం చేస్తున్న రేవంత్‌ ఈ రోజు ఢిల్లీ ప్రజలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 400 రోజులు గడిచినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌ మాటలను ప్రజలు నమ్మలేదని.. అందుకే ఆయన ప్రచారం చేసిన అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్‌ను అక్కడి ప్రజలు ఓడించారన్నారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌ కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో రేవంత్‌ రెడ్డి చెప్పాలన్నారు. రుణమాఫీ 30 శాతం కూడా అమలు కాలేదని, సంక్రాంతి అయిపోయినా రైతుభరోసా ఊసే లేదన్నారు.

చట్టాన్ని గౌరవించే బాధ్యత గల నాయకుడిగా కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లారని తెలిపారు. ఇది అక్రమ కేసు అని, నయా పైసా అవినీతి జరగలేదని ఆయర మొదట్నుంచి చెప్తూనే ఉన్నారని తెలిపారు. పోలీసులు అత్యుత్సాహంతో ఈడీ ఆఫీస్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేశారన్నారు. పోలీసులు చట్టానికి లోబడే పని చేయాలని.. రేవంత్‌ చెప్పినట్టు పని చేస్తామంటే రోజులు ఒకేలా ఉండవని గుర్తు పెట్టుకోవాలన్నారు. హైదరాబాద్‌ ప్రతిష్ట కోసం ఫార్ములా -ఈ రేస్‌ విషయంలో కేటీఆర్‌ ఆ రోజు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఫార్ములా -ఈ రేస్‌ ను రద్దు చేసిన రేవంత్‌ రెడ్డిపైనే కేసు నమోదు చేసి ఈడీ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు ఏసీబీని డైరెక్ట్‌ చేస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. బీజేపీ నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌, బీజేపీ ఎంపీల వ్యాఖ్యలు వింటుంటే ఈ అనుమానం బలపడుతుందన్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ పై స్పీకర్‌ అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగంలో ఉన్న ప్రతి అవకాశాన్ని బీఆర్‌ఎస్‌ ఉపయోగించుకుంటుందన్నారు. రేవంత్‌ రెడ్డి తన పాత పార్టీ మూలాలను పదే పదే గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ఈ పిట్ట బెదిరింపులకు కేటీఆర్‌ భయపడరని తేల్చిచెప్పారు. కేటీఆర్‌ ఉద్యమకారుడని.. ఉద్యమ నాయకుని రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని గురత్ఉ చేశారు. తమకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని.. ఎన్ని కుట్రలకు పాల్పడిన వాటిని ఛేదించుకొని కడిగిన ముత్యంలా కేటీఆర్‌ బయటకు వస్తారన్నారు. రేవంత్‌ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని 13 హామీలు, 420 వాగ్దానాలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన కేసీఆర్‌ సైనికులుగా తాము కొట్లాడుతూనే ఉంటామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, జాజుల సురేందర్, నాయకులు కురవ విజయ్ కుమార్, రాజు, దాదన్న గారి విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News