ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూలిన పైకప్పు.. ఒకరి మృతి, సర్వీసులు రద్దు
టెర్మినల్-1 పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. రూఫ్ షీట్‌తో పాటు దాని సపోర్టెడ్ బీమ్స్ కూలిపోయాయి. దీంతో పికప్, డ్రాప్ ఏరియాలోని కార్లన్ని ధ్వంసం అయ్యాయి.
భారీ వర్షాలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు టెర్మినల్ - 1 పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో టెర్మినల్-1లో రాకపోకలు నిలిపివేశారు. చెక్ ఇన్ కౌంటర్‌లు సైతం మూసివేశారు. టెర్మినల్ - 1లో దేశీయ విమాన సర్వీసులకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతాయని అధికారులు చెప్తున్నారు. టెర్మినల్ - 1 నుంచి రాకపోకలు కొనసాగించే స్పైస్‌జెట్, ఇండిగో సర్వీసులు మధ్యాహ్నం 2 వరకు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టు ఒకటి.
తెల్లవారుజామున 5 గంటల సమయంలో టెర్మినల్-1 పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. రూఫ్ షీట్‌తో పాటు దాని సపోర్టెడ్ బీమ్స్ కూలిపోయాయి. దీంతో పికప్, డ్రాప్ ఏరియాలోని కార్లన్ని ధ్వంసం అయ్యాయి. సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో ఓ బీమ్ కింద నలిగి చనిపోయిన వ్యక్తిని గుర్తించారు సిబ్బంది. గాయాలైన వారికి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. వ్యక్తిగతంగా సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులు, సిబ్బందికి సూచించినట్లు చెప్పారు.
ఇక మరోవైపు మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని డుమ్నా ఎయిర్‌పోర్టులోనూ గురువారం పైకప్పు కుప్పకూలింది. భారీ వర్షాల కారణంగా నీరు నిలిచి పైకప్పు కూలిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఓ కారు పూర్తిగా ధ్వంసమైంది. రూ.450 కోట్లతో నిర్మించిన ఈ ఎయిర్‌పోర్టు బిల్డింగ్‌ను మార్చిలో ప్రారంభించారు ప్రధాని మోడీ.