హిమాచల్ ఎన్నికల్లో బీజేపీకి రెబల్స్ బెడద..

బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి వందన గులేరియా టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో పదవికి రాజీనామా చేశారు. చివరి నిమిషంలో నియోజకవర్గాలను మార్పు చేయడంతో మంత్రులు సురేశ్‌ భరద్వాజ్‌, రాకేశ్‌ పటానియా మద్దతుదారులు రగిలిపోతున్నారు.

Advertisement
Update:2022-10-26 11:02 IST

హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబర్ 12న అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. రెండోసారి కూడా అధికారం చేజిక్కించుకోడానికి ఆ పార్టీ పావులు కదుపుతోంది. కానీ పరిస్థితి సానుకూలంగా లేదు. స్థానిక సమస్యలతోపాటు, దేశవ్యాప్తంగా మోదీ సర్కారుపై పెరుగుతున్న వ్యతిరేకత హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రతిబింబించేలా ఉంది. దీంతో బీజేపీ అధిష్టానం ఎత్తుకు పైఎత్తులు వేయాలని చూస్తోంది.

11మంది సిట్టింగ్‌లకు షాక్..

68 అసెంబ్లీ స్థానాల హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ సొంత బలం 45 సీట్లు. ఇందులో ఇప్పుడు 11 మంది సిట్టింగ్‌లకు అధిష్టానం టికెట్లు ఇవ్వడం లేదు. ఇద్దరు మంత్రులు సహా మరో ఇద్దరు సీనియర్ నేతలకు సీట్లు మార్చి షాకిచ్చింది. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో రెబల్స్ ని బుజ్జగించే పనిలో పడింది బీజేపీ. 11 మందిలో ఐదుగురు రెబల్స్ గా బరిలో దిగారు. మిగతా వారు లోపాయికారీగా ఇతర పార్టీలకు మద్దతు తెలుపుతారని తెలుస్తోంది. దీంతో బీజేపీకి సొంత పార్టీ నేతలతోనే ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఆ లోగా రెబల్స్ ని బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది బేజేపీ. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్ నేత రూప్‌ సింగ్‌ కుమారుడు అభిషేక్‌ ఠాకూర్‌ సుందేర్‌ నగర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. నాచ్చన్‌ నియోజకవర్గం నుంచి కీలక నేత గ్యాన్‌ చౌహాన్‌, బంజర్‌ నియోజకవర్గం నుంచి మరో సీనియర్ నేత మహేశ్వర్‌ సింగ్‌ తనయుడు హితేశ్వర్‌ సింగ్‌ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. ముఖ్యమంత్రి జైరాం రమేశ్‌ ఠాకూర్‌ సొంత జిల్లా మండిలో కూడా బీజేపీకి రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది.

ధరమ్‌ పూర్‌, కార్సోగ్‌, జోగిందర్‌ నగర్‌, దారంగ్‌ నియోజకవర్గాల్లో కూడా పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆశావహులు అక్కడ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి వందన గులేరియా టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో పదవికి రాజీనామా చేశారు. చివరి నిమిషంలో నియోజకవర్గాలను మార్పు చేయడంతో మంత్రులు సురేశ్‌ భరద్వాజ్‌, రాకేశ్‌ పటానియా మద్దతుదారులు రగిలిపోతున్నారు. కొత్త నియోజకవర్గంలో ఓటమి తప్పదని అంచనా వేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News