వడ్డీ రేట్లలో నో చేంజ్.. ఆర్బీఐ వెల్లడి
పరపతి విధాన కమిటీ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగా.. ఆ వివరాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. వడ్డీ రేట్ల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వరుసగా మూడోసారి కావడం గమనార్హం. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఎంఎస్ఎఫ్, బ్యాంకు రేటు సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.
పరపతి విధాన కమిటీ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగా.. ఆ వివరాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. గతంలో జూన్‌లో ఈ సమావేశాలు జరగగా.. అప్పట్లోనూ రెపో రేటును ఎలాంటి మార్పూ చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. అంతకుముందు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేరకు ఆర్‌బీఐ పెంచింది.