ప్రయాణికులు వస్తువులు పోగొట్టుకుంటే.. రైల్వే శాఖది బాధ్యత కాదు.. - సుప్రీంకోర్టు
ప్రయాణికుడు తన సొంత వస్తువులను రక్షించుకోలేనప్పుడు దానికి రైల్వేశాఖను బాధ్యుల్ని చేయడం సరికాదని చెప్పారు.
రైలు ప్రయాణికులు ఎవరి వస్తువులకు వారే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారు వస్తువుల పోగొట్టుకుంటే దానికి రైల్వే శాఖది బాధ్యత కాదని తెలిపింది. అది సేవా లోపం కిందకు రాదని శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో తెలిపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కేసులో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఆహసనుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేందర్ భోళా అనే వస్త్ర వ్యాపారి 2005లో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్‌లో అతను ఢిల్లీ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితుడు సురేంద్ర ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన నడుముకు గట్టిగా బెల్టు బిగించుకుని మరీ డబ్బు దాచుకున్నానని.. అయినా అవి రైలులో చోరీకి గురయ్యాయని బాధితుడు తెలిపాడు. తనకు ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు. దీంతో ఫోరం అతనికి అనుకూలంగా తీర్పు చెప్పింది.
దీనిపై స్టేషన్ సూపరింటెండెంట్ దీనిని సవాలు చేయగా రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాలు కూడా అతని అప్పీళ్లను తోసిపుచ్చాయి. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారించిన ధర్మాసనం రైల్వేశాఖకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. చోరీ రైల్వే సేవల లోపం కిందకు వస్తుందని వినియోగదారుల ఫోరాలు ఎలా చెప్పాయో తమకు అర్థం కావడం లేదని న్యాయమూర్తులు తెలిపారు. ప్రయాణికుడు తన సొంత వస్తువులను రక్షించుకోలేనప్పుడు దానికి రైల్వేశాఖను బాధ్యుల్ని చేయడం సరికాదని చెప్పారు. అందువల్ల ఈ కేసులో రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాలు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తున్నామని ధర్మాసనం తీర్పు చెప్పింది.