ఇల్లు ఖాళీ చేసిన రాహుల్ గాంధీ.. ఎక్కడికెళ్లారంటే..?
12 తుగ్లక్ లైన్ లోని తన బంగ్లా నుంచి ఆయన సామానుతో సహా బయటకు వెళ్లిపోయారు. బంగ్లా నుంచి సామానుతో వెళ్తున్న వీడియోలు ఇప్పుడు వైరరల్ గా మారాయి.
మోదీ ఇంటి పేరు కేసులో రెండేళ్ల జైలుశిక్షతో ఎంపీగా అనర్హతకు గురైన రాహుల్ గాంధీ.. తనకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. 12 తుగ్లక్ లైన్ లోని తన బంగ్లా నుంచి ఆయన సామానుతో సహా బయటకు వెళ్లిపోయారు. రాహుల్, బంగ్లా నుంచి సామాన్లతో వెళ్తున్న వ్యాన్లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరరల్ గా మారాయి.
రాహుల్ ఎక్కడికెళ్లారు..?
ఇల్లు ఖాళీ చేసిన రాహుల్ గాంధీ ఎక్కడికెళ్లారనే విషయంపై మరో చర్చ మొదలైంది. అయితే ఈ విషయంలో పెద్దగా చర్చకు తావులేకుండా ఆ వ్యాన్లు నేరుగా సోనియా గాంధీ ఇంటికి వెళ్లాయి. 10 జన్ పథ్ లోని సోనియా ఇంటికి రాహుల్ గాంధీ చేరుకున్నారు.
ఎంపీగా డిస్ క్వాలిఫై అయిన తర్వాత రాహుల్ గాంధీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ నేతలతో సహా విపక్షాలు మండిపడ్డాయి. రాహుల్ గాంధీ తమ ఇంటిలో ఉండొచ్చంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానించారు. ఢిల్లీలోని ఓ మహిళా నేత ఏకంగా రాహుల్ పేరిట తన ఇంటిని మార్చేసి ఆ డాక్యుమెంట్లను కూడా మీడియా ముందు పెట్టారు. రాహుల్ కూాడా ఓ దశలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఆ బంగ్లాతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చివరకు ఆ బంగ్లా ఖాళీ చేసి తన తల్లి సోనియా దగ్గరకు వెళ్లిపోయారు రాహుల్.