అదాని-ప్రధాని.. మరోసారి రాహుల్ ప్రశ్నల వర్షం
అదానీ గ్రూప్ కి మద్దతు తెలుపుతున్న కేంద్రం, దేశం పరువు తీస్తోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు.
అదానీ గ్రూప్ వ్యవహారం మరోసారి హైలైట్ అవుతోంది. వందల మిలియన్ల డాలర్లను అజ్ఞాత ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి లబ్ధి పొందారని ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP)’ ఆరోపించింది. మారిషస్ కేంద్రంగా పనిచేస్తున్న ‘అజ్ఞాత’ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ల ద్వారా పెట్టుబడులు వచ్చినట్టు చెప్పింది. దీంతో అదానీ గ్రూప్ మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపణల తర్వాత మరోసారి OCCRP ద్వారా అదానీ చిక్కుల్లో పడింది. అదానీ స్టాక్స్ కూడా నష్టాలు చవిచూశాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మరోసారి ఈ వ్యవహారంపై మండిపడ్డారు. ముంబైలో జరిగే ఇండియా కూటమి సమావేశాలకోసం వచ్చిన రాహుల్ గాంధీ, అదానీ వ్యవహారంపై ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇప్పటికైనా అదానీ గ్రూప్ పై ప్రధాని నోరు తెరుస్తారా అని ప్రశ్నించారు.
దేశం పరువు తీస్తున్నారు..
అదానీ గ్రూప్ కి మద్దతు తెలుపుతున్న కేంద్రం, దేశం పరువు తీస్తోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. హిండెన్ బర్గ్ గ్రూప్ ఆరోపణలు, ఆ తర్వాత OCCRP ఆరోపణలతో అదానీ గ్రూప్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైందని, ఇంకా కేంద్రం వారిని వెనకేసుకు రావడం ఏంటని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. జీ20 సమావేశాల్లో విదేశీ నేతలు అదానీ గ్రూప్ కుంభకోణంపై ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారన్నారు. ప్రధాని మోదీకి ఈ అదానీ గ్రూప్.. ఎందుకు అంత ప్రత్యేక సంస్థగా మారిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై స్వారీ చేసేందుకు అదానీకి ఎందుకు అనుమతిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు రాహుల్.
పెట్టుబడులతో అదానీ గ్రూపు షేర్ల ధరలు కృత్రిమంగా పెంచారని, షేర్ల పెరుగుదలతో వచ్చిన సొమ్ముతో అదానీ ఎన్నో ఆస్తులు కొన్నారని, అదానీ పోర్టులు, ఎయిర్ పోర్టులు కొనుగోలు చేశారని, ఈ డబ్బంతా ఎవరిది..? అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. గతంలో వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్ కి సెబీ క్లీన్ చిట్ ఇచ్చిందని, అదానీకి క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎన్డీటీవీలో డైరెక్టర్ గా ఉన్నారని, దీన్నిబట్టి అదానీ గ్రూపులో ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతోందన్నారు రాహుల్ గాంధీ.